స్పైసెస్ పార్కు అభివృద్ధికి బ్లూప్రింట్
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
గుంటూరు జిల్లాలో స్పైసెస్ పార్కు ప్రారంభం
గుంటూరు: పారిశ్రామిక వేత్తలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా స్పైసెస్ (సుగంధ ద్రవ్యాల) పార్కును తీర్చిదిద్దేందుకు బ్లూప్రింట్‌ను తయారు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో నిర్మించిన స్పైసెస్ పార్కును సోమవారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. 124.78 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన పార్కును పారిశ్రామిక వేత్తలు వినియోగించుకోవాలని కోరారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్‌ను వినియోగించుకునే హక్కు ప్రతీ రైతుకు ఉందన్నారు. ఇప్పటి వరకు 18 మంది సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారులకు 38 ఎకరాలను కేటాయించామని, మిగిలిన ఎగుమతిదారులు ఈ పార్కులో వ్యాపారం ప్రారంభించేందుకు ముందుకు రావాలని కోరారు. ఎగుమతులకు చైనా దేశంలోని షాంగై ఎంత ప్రసిద్ధి చెందిందో అదే విధంగా విశాఖపట్నం, భీమవరంలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు.
ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తాం..
తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి మిరప రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్కువుగా వాడుతున్నారని, వీటి వినియోగం పట్ల రైతులకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీనికోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. మిరపకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఈ పార్కును ఏర్పాటు చేసామన్నారు.
అవినీతిని ఉపేక్షించం: సీఎం
తిరుపతి: ‘‘నవ్యాంధ్రప్రదేశ్‌కు పెద్దను మాత్రమే. పెత్తనం చేయను. ఉద్యోగులకు గౌరవం పెంచేందుకే 43 శాతం ఫిట్మెంట్ పెంచాం. దీంతో కార్పొరేట్ స్థాయిలో జీతాలు అందుతాయి. అదే స్థాయిలో అవినీతిని తగ్గిస్తాం. అవినీతిని ఉపేక్షించే ప్రసక్తేలేదు. నన్ను నమ్మండి.. ఉద్యోగులందరికీ మేలు చేస్తాను. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులను కోరారు. సోమవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో ‘నవ్యాంధ్ర నిర్మాణంలో ఉద్యోగుల భాగస్వామ్యం’పై ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సదస్సులో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగులు ఏకధాటిగా 81 రోజుల పాటు యోధులుగా పోరాటం చేశారని, అందుకే వారి సేవకు గుర్తింపుగా ఆ రోజులకు ప్రత్యేక సెలవు దినాలుగా ప్రకటించామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తారన్న అనుమానాలు వద్దని, అలాంటి వారికి భద్రత కల్పించే విషయంలో చొరవ చూపుతున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచటం, రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఉద్యోగులకు హెల్త్‌కార్డుల మంజూరు చేశామని గుర్తు చేశారు.
ఇబ్బంది పెట్టడానికే తెలంగాణ ఫిట్మెంట్
తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టేందుకు ఫిట్మెంట్ ప్రకటించిందని, అయినప్పటి కీ తాను భయపడకుండా 43 శాతం ప్రకటించానని అన్నారు. ఇతర రాష్ట్రాలకు లేని విధంగా 974 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉందని, ఇక్కడ విస్తారంగా పోర్టులు నిర్మించి రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మారుస్తామని పేర్కొన్నారు. ఖనిజ సంపదను వెలికి తీసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామన్నారు. ప్రతి ఉద్యోగికీ ఐపాడ్, ట్యాబ్‌లు అందజేస్తామని, తద్వారా ప్రభుత్వ సేవలను మరింత వేగంగా ప్రజలకు చేరవేస్తామని అన్నారు. ఉద్యోగులు కూడా సాంకేతికంగా, విజ్ఞానపరంగా సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.