సీతాకోక చిలుకల రుచిమొగ్గలు కాళ్లలో ఉంటాయా?
జంతు ప్రపంచం
ప్రపంచంలో మొత్తం ఇరవై నాలుగు వేల రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఒక్క ఆస్ట్రేలియాలోనే 385 రకాలు ఉన్నాయి! ఇవి పొట్ట భాగంలో ఉండే ‘స్పిరాకిల్స్’ అనే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి! వీటికి ఊపిరి తిత్తులు ఉండవు!
సీతాకోక చిలుకలకు రుచిమొగ్గలు కాళ్లలో ఉంటాయి. అందుకే ఇవి తమ కాళ్ల ద్వారా రుచి చూస్తాయి. ట్యూబ్స్లా ఉండే నాలుకల ద్వారా తేనెను జుర్రుకుంటాయి. ఆనక ఈ నాలుకలను చుట్టలా చుట్టేస్తాయి! ముఖ భాగంలో ఉండే పొడవాటి యాంటెన్నాల ద్వారా వాసన చూస్తాయి! వీటికి చెవులు లేనందున శబ్దాలు వినలేవు. వైబ్రేషన్స్ ద్వారా చుట్టుపక్కల శబ్దాలను గ్రహిస్తాయి! సీతాకోకచిలుకలకు మూడు జతల కాళ్లు ఉంటాయి. ఆ కాళ్ల చివర జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అందుకే పూల రేకుల మీద, గోడల మీద జారిపోకుండా అతుక్కుని నిలబడతాయి!
ఇవి ఘనాహారాన్ని తీసుకోవు. కేవలం ద్రవాలనే తాగి బతుకుతాయి. పూలలో ఉండే తేనె ప్రధాన ఆహారమే అయినా, మట్టిలో ఉండే మినరల్స్ కోసం బురద గుంటల్లోని నీటినీ తాగుతుంటాయి! ఇవి శీతల రక్త జీవులు. తమ శరీర ఉష్ణోగ్రత 86 డిగ్రీల ఫారన్హీట్ ఉంటే తప్ప ఇవి ఎగుర లేవు. ఉష్ణోగ్రత 55 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అసలు కదలను కూడా కదలలేవు! ఇవి కేవలం పది నుంచి పన్నెండడుగుల దూరంలో ఉన్నవాటిని మాత్రమే చూడగలుగుతాయి! వీటి జీవితకాలం కేవలం 2 నుంచి 4 వారాలు మాత్రమే. ఏవో కొన్ని రకాలు మాత్రమే పది నెలల వరకూ జీవిస్తాయి!