గన్ మెన్ కాల్పులు, కారు బాంబు పేలుళ్లు..
గన్ మెన్ కాల్పులు, కారుబాంబు పేలుళ్లు, 20 మంది మృతి
బుర్కినా ఫాసో రాజధానిలో ఓ హోటల్ వద్ద దుర్ఘటన
యూఎన్ అధికారులు, పశ్చిమ దేశాలవాళ్ల తాకిడి ఎక్కువ
ఔగాడుగు: కారు బాంబు పేలుళ్లు సహా గన్ మెన్ జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా మృతిచెందారు. ఈ ఘటన ఆఫ్రికా లోని బుర్కినా ఫాసోలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధాని ఔగాడుగులోని ఫోర్ స్టార్ హోటల్ స్పెన్డిడ్ వద్ద ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. మొదటగా కొందరు గన్‌మెన్స్ హోటల్ ను చుట్టుముట్టారు. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుంటుండగానే గన్ మెన్ కారు బాంబులు పేల్చేశాడు.
ఈ ఘటనలో 20 మందికి పైగా మృతిచెందడంతో పాటు మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్య అని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు. ఓ మంత్రి సహా 63 మందిని అల్ ఖైదా ఉగ్రవాదులు తమ బంధీలుగా అదుపులోకి తీసుకున్నారు. కారు బాంబు దాడులు, గన్ మెన్ కాల్పుల అనంతరం ఫ్రెంచ్ ఆర్మీ, అమెరికన్ బలగాలు రంగంలోకి దిగాయి. కొన్ని గంటలు అల్ ఖైదా ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపి 63 మందిని సురక్షితంగా వారి చెర నుంచి విడిపించాయి.
ఈ దాడికి పాల్పడింది తామేనంటూ స్థానిక అల్ ఖైదా గ్రూపు అనుబంధ సంస్థ ఏక్యూఐఎమ్ ప్రకటించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
15 మందికి బుల్లెట్ గాయాలు ఉన్నాయని, దాడినుంచి తప్పించుకునే యత్నంలో మరికొంతమందికి గాయాలయ్యాయని రాజధానిలోని యల్గాడో ఆస్పత్రి వైద్యులు వివరించారు. యూఎన్ అధికారులు, పశ్చిమ దేశాల వాసులు ఎక్కువగా స్పెన్డిడ్ హోటల్ లో బస చేస్తుంటారు. వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దు దేశం మాలిలోని రాడిసన్ హోటల్లోనూ గతేడాది ఇదేవిధంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మందికి పైగా మృతిచెందిన విషయం అందరికీ విదితమే.
ఉగ్రదాడికి గురైన హోటల్ ఇదే..