పాక్ అండతోనే దేశంలో ఉగ్రవాదం
రాజ్‌నాథ్ మండిపాటు
అఫ్ఘాన్-పాక్ సరిహద్దులో దావూద్‌కు ఆశ్రయం
న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాదానికి పాకిస్థాన్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఆశ్రయం కల్పించారని వెల్లడించారు. శనివారం ఇక్కడ జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ఆయన ప్రసంగించారు. దాయాది దేశం పాక్‌కు స్నేహ హస్తం అందించడానికి ప్రయత్నిస్తున్నా.. దానిని అందుకోవడానికి ఆ దేశం మాత్రం సుముఖంగా లేదన్నారు. భారత్‌లో ఉగ్రవాదం అంతా పాక్ ప్రేరేపితమేనన్నారు. ప్రభుత్వ సంస్థలేవీ ఉగ్రవాదానికి సహకరించడంలేదని పాక్ చెబుతోందని, అయితే ఐఎస్ఐ ఆదేశ ప్రభుత్వ సంస్థ కాదా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఐఎస్ఐ సహాయ, సహకారాలు అందిస్తోందన్నారు.
2008 ముంబై అల్లర్ల కేసులో నిందితులను శిక్షించడానికి పాక్ చర్యలు తీసుకోవడంలేదని, దర్యాప్తును చాలా నెమ్మదిగా కొనసాగిస్తోందని ఆరోపించారు. దావూద్‌ను అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా పాక్ పెడచెవిన పెడుతోందన్నారు. ఈ విషయంలో ప్రధాని కూడా ప్రయత్నం చేశారన్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతున్నామని చెప్పారు. దావూద్ పాక్, అఫ్ఘాన్ బోర్డర్లో ఉన్నాడని చెప్పారు.
భారత్‌తో మాట్లాడే ముందు కాశ్మీరీ వేర్పాటువాదులతో మాట్లాడతానని పాక్ ప్రధాని స్పష్టం చేశారు కదా అని ప్రశ్నించగా.. పాక్ నిర్ణయం స్పష్టంగా ఉంటే, తమ నిర్ణయమూ స్పష్టంగా ఉందన్నారు. అంతర్గత భద్రతపై తమ ప్రభుత్వం వెనకడుగువేసేది లేదన్నారు. ప్రధాని అందరు మంత్రులకు స్వేచ్ఛనిచ్చారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాను, ప్రధాని కూడా ఆర్ఎస్ఎస్ పరివారమేనని, అదేమీ బాహ్యశక్తి కాదని అన్నారు.