అంజూ జార్జిని వేధిస్తున్న కొత్త క్రీడల మంత్రి
తిరువనంతపురం: తనను క్రీడలశాఖ మంత్రి వేధింపులకు గురిచేశాడని ప్రముఖ క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆమె తన ఫిర్యాదు వివరాలతో కూడిన లేఖను ముఖ్యమంత్రికి అందించింది. తొలిసారి జరిగిన సమావేశంలోనే క్రీడాశాఖ మంత్రి ఈపీ జయరాజన్ తనను, తనతోపాటు ఉన్న ఇతర సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. ప్రస్తుతం అంజూ కేరళ క్రీడల మండలి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆమె, తన మండలి సభ్యులు తొలిసారి వెళ్లి క్రీడాశాఖ మంత్రిని కలిశారు.
అయితే వారిని ప్రతిపక్షానికి మద్ధతుదారులని తిట్టారని, మున్ముందు తమ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బెంగళూరు నుంచి కేరళకు అంజూ విమానంలో ప్రయాణించారంట. అయితే, ఈ కారణంతో ఆమె.. తన కౌన్సిల్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని, అయితే, తమకు ట్రావెల్ అలవెన్సులు ఆర్థికశాఖ మంజూరు చేసిందని ఆమె చెప్పారు.
ఒక శాఖకు సంబంధించి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఆ శాఖ ఎలా పనిచేస్తుందో విధివిధానాలు ఏమిటో ఓ మంత్రి కనీసం తెలుసుకోకుంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు. తమ మండలి తీసుకున్న ట్రాన్స్ఫర్ల నిర్ణయాన్ని కూడా మంత్రి రద్దు చేశారని సీఎంకు చెప్పారు. ఈ విషయంలో తాను ప్రశ్నిస్తే బెదిరించారని అన్నారు. తనకు ప్రభుత్వంలో ఏదో స్థానంలో ఉండాలనో, అధికారం కావాలనో పెద్ద ఆశ కూడా లేదని చెప్పారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన ముఖ్యమంత్రి సానూకూలంగా స్పందించారు. తాను స్వయంగా ఈ విషయం గురించి తెలుసుకుంటానని అన్నారు.