పాలకమండలి వట్టిదేనా!
ఇంతవరకూ జీవో రాలేదు
గోళ్లు గిల్లుకుంటున్న చైర్మన్, సభ్యులు
దుర్గగుడిలో విచిత్ర పరిస్థితి
విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాలకు ఒక రోజు ముందు ప్రభుత్వం దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పాలకమండలి పేర్లను ప్రకటించినా అది ఉనికిలోకే రాలేదు. టీడీపీ సీనియర్ నేత యలమంచిలి గౌరంగబాబు చైర్మన్గా 14 మందితో పాలకమండలి పేర్లు ప్రకటించారు. ఇది జరిగి వారం గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. దీంతో పాలకమండలి సభ్యులు ప్రస్తుతం త్రిశంకుస్వర్గంలో ఉన్నట్లయింది. అసలు ఈ కమిటీ ఏర్పడుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పాలకమండలే లేదన్న మంత్రి?
ఇటీవల జిల్లాకు చెందిన ఒక మంత్రి తొలిరోజునే దేవస్థానానికి రాగా, పాలకమండలి గురించి సభ్యులు ఆయనకు వివరించారు. అసలు పాలకమండలే లేదు కాదా? జీవో వచ్చినప్పుడు చూద్దాం అంటూ ఆ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.
బీజేపీ రాజేసిన అగ్గితో ఆగిందా
పాలకమండలిని పచ్చనేతలతో నింపడంతో నగర బీజేపీ నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో నగర పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. ఇది గాలివానగా మారి నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు సస్పెన్షన్ వరకూ వచ్చింది. ఇలాంటి సమయంలో పాలకమండలి జీవోను విడుదల చేయడం మంచిది కాదని ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
ఉత్సవ విగ్రహాల్లా చైర్మన్, సభ్యులు
చైర్మన్ గౌరంగబాబుతో పాటు మిగిలిన సభ్యులు రోజు కొండపైకి వస్తున్నాయి. అయితే ట్రస్టుబోర్టు సభ్యులకు ఇచ్చే ప్రాధాన్యత ఈవో ఎ.సూర్యకుమారి కాని, ఇతర దేవస్థానం అధికారులు కాని వీరికి ఇవ్వడం లేదు. వారు కూర్చునేందుకు రూమ్ కాని, కుర్చీలు కాని లేవు. దీంతో దేవాలయం బయట ఉన్న ఖాళీస్థలంలోనే వీరు తిరుగుతున్నారు. ఇక వారు చేసే సూచనల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అంతా మా ఖర్మ అని నిట్టూర్చడం తప్ప ఏం చేయలేకపోతున్నారు.