Sri Kodahana Ramaswamy
-
9న ఒంటిమిట్ట కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట(సిద్దవటం): ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఈనెల 9వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరగనుంది.10 తేదీన ఉదయం 8నుంచి 9 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం శేషవాహనం, 11న వేణుగాన అలంకారం, హంసవాహనం, 12న వటపత్రశాయి అలంకారం, సింహవాహనం, 13న నవనీత కృష్ణ అలంకారం, హనుమత్సేవ, 14న మోహినీ అలంకారం, గరుడసేవ, 15న శివధనుర్భాలంకారం, రాత్రి 8 గంటలకు శ్రీ సీతా రాముల కల్యాణం, గజవాహనం, 16న రథోత్సవం, 17న కాళీయమర్ధన అలంకారం, ఆశ్వవాహనం, 18న చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావ రోహణం, 19న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరగనున్నాయి. కల్యాణోత్సవానికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ కడప అర్బన్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్సోత్సవాల్లో భాంగా ఈనెల 15న నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి విచ్చేయనుండటంతో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధికసంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయపరిసరాలు, కల్యాణ వేదిక వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో ఏఆర్ డిఎస్పీ రమణయ్య, కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ బాలస్వామిరెడ్డి, ఎస్బి సీఐలు వెంకటకుమార్, రెడ్డెప్ప, ఆర్ఐ మహబూబ్‌బాషా, కడప ఒన్‌టౌన్ సీఐ టివి సత్యనారాయణ, అర్బన్ సీఐ ఎస్ఎం ఆలీ తదితరులు పాల్గొన్నారు -
వైభవంగా కోదండరాముడి రథోత్సవం
తిరుపతి కల్చరల్: శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుం డగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి రథాన్ని లాగారు. రథం నాలుగు మాడ వీధుల్లో విహరించి యథాస్థానానికి చేరిన తర్వాత ప్రబంధ, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు. సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు అర్చకులు రథ మండపంలో తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అశ్వవాహనసేవ వేడుకగా జరిగింది. రఘురాముడు సర్వాంగసుందరంగా అలంకారప్రియుడై అశ్వాన్ని అధిరోహించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. టీటీడీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ తిరుపతి జేఈవో పోలాభాస్కర్, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో భూపతిరెడ్డి, వీఎస్వో రవీంద్రరెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ, శేషారెడ్డి పాల్గొన్నారు. ఆనందభరితం జానపద భక్తి సంగీతం బ్రహ్మోత్సవాల సందర్భంగా మహతి కళాక్షేత్రంలో హైదరాబాద్‌కు చెందిన ఎద్దుల జంగిరెడ్డి నిర్వహించిన ‘రామన్న రాముడు కోదండరాముడు’ జానపద భక్తి గీతాలు శ్రోతలను ఆనందభరితుల్ని చేశాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర పుష్కరిణి వేదికపై సాయంత్రం 6 నుంచి 8.30 గంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్ర పుష్కరిణి వేదికపై కళాకారులు ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. నేడు కపిలతీర్థంలో చక్రస్నానం కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందు కోసం ఉదయం 6 గంటలకు స్వామివారు పల్లకిలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరనున్నారు. చక్రస్నానం అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయానికి చేరుకుంటారు.