
వైభవంగా కోదండరాముడి రథోత్సవం
తిరుపతి కల్చరల్: శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుం డగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి రథాన్ని లాగారు. రథం నాలుగు మాడ వీధుల్లో విహరించి యథాస్థానానికి చేరిన తర్వాత ప్రబంధ, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.
సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు అర్చకులు రథ మండపంలో తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అశ్వవాహనసేవ వేడుకగా జరిగింది. రఘురాముడు సర్వాంగసుందరంగా అలంకారప్రియుడై అశ్వాన్ని అధిరోహించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. టీటీడీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ తిరుపతి జేఈవో పోలాభాస్కర్, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో భూపతిరెడ్డి, వీఎస్‌వో రవీంద్రరెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మురళీకృష్ణ, శేషారెడ్డి పాల్గొన్నారు.
ఆనందభరితం జానపద భక్తి సంగీతం
బ్రహ్మోత్సవాల సందర్భంగా మహతి కళాక్షేత్రంలో హైదరాబాద్‌కు చెందిన ఎద్దుల జంగిరెడ్డి నిర్వహించిన ‘రామన్న రాముడు కోదండరాముడు’ జానపద భక్తి గీతాలు శ్రోతలను ఆనందభరితుల్ని చేశాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర పుష్కరిణి వేదికపై సాయంత్రం 6 నుంచి 8.30 గంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్ర పుష్కరిణి వేదికపై కళాకారులు ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి.
నేడు కపిలతీర్థంలో చక్రస్నానం
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందు కోసం ఉదయం 6 గంటలకు స్వామివారు పల్లకిలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరనున్నారు. చక్రస్నానం అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయానికి చేరుకుంటారు.