పోలీస్ .... అభిమానులు
బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారని అదుపులోకి తీసుకోబోయిన పోలీసులు
ఖాకీలపై దాడి చేసిన ఆదిలాబాద్ యువకులు
ముగ్గురు పోలీసులకు గాయాలు అదుపులో నిందితులు
ఉప్పల్: ఇండియా, శ్రీలంక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆదివారం ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు, అభిమానులు మధ్య ‘బ్లాక్టికెట్ల’ విషయమై ఘర్షణ జరిగింది. బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నారనే అనుమానంతో మఫ్టీలో ఉన్న పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకొనేందుకు యత్నించగా .. పోలీసులపై వారు దాడి చేశారు. పోలీసులు అతికష్టం మీద వారిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ స్టేడియం వద్ద కొందరు బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో ఉప్పల్ క్రై పార్టీ పోలీసులు మఫ్టీలో వెళ్లారు. గేట్ నంబర్ -3 వద్ద ఆదిలాబాద్‌కు చెందిన దాదాపు 12 మంది యువకులు పెద్ద మొత్తంలో టికెట్లు చేత్తో పట్టుకొని పోలీసులకు కనిపించారు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు వారిని అదుపులోకి తీసుకోబోగా ఒక్కసారిగా తిరగబడ్డారు. పోలీసులపై పిడి గుద్దుల వర్షం కురిపించారు.
అక్కడే యూనిఫామ్‌లో ఉన్న పోలీసులు అడ్డుకున్నా.. ఆగకుండా వారిపై కూడా దాడి చేసి చితకబాదారు. ఇంతలో మరికొంత మంది పోలీసు సిబ్బంది వచ్చి ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఉప్పల్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ మోతీలాల్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి పంపేశారు. బాధిత పోలీసులు ఫిర్యాదు మేరకు నిందితులు లక్ష్మణ్(22), వాసు(28), ఆదిత్య(28), శంకర్(27), అనిష్ (28), సూర్యాకాంత్(32), ప్రఫూల్(32), ప్రవీణ్(29), అరవింద్(26), సంతోష్ (27)లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన వీరంతా క్రికెట్ బెట్టింగ్స్ పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు. సెల్ఫోన్లో సమాచారం చేరవేస్తూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు విచారణలో నిందితులు వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులని తెలియక ఎదురు తిరిగాం....
యువకుల వాదన మరోలా ఉంది. తామంతా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేశామని, వాటిని పంచుకుంటుండగా కొందరు వచ్చిలాక్కొన్నారని చెప్పారు. పెనుగులాటతో టికెట్లు చిరిగిపోయాయని, వచ్చిన వారు పోలీసులని తెలియక ఎదురు తిరిగామని చెప్పి వాపోయారు.