సంగక్కర ‘డబుల్’
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వెటరన్ బ్యాట్స్‌మన్ సంగక్కర (306 బంతుల్లో 203; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ మోత మోగించడంతో... ఆదివారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 102.1 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. దీంతో మ్యాథ్యూస్ సేనకు 135 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. చండిమల్ (143 బంతుల్లో 67; 8 ఫోర్లు) రాణించాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. లాథమ్ (9 బ్యాటింగ్), రూథర్‌ఫోర్డ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఇంకా 113 పరుగులు వెనుకబడి ఉంది. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు. 12 డబుల్ సెంచరీలతో డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతకుముందు 78/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఆట కొనసాగించిన లంక ఇన్నింగ్స్‌కు సంగక్కర వెన్నెముకగా నిలిచాడు. అటాకింగ్‌ను పక్కనబెట్టి ఓపికగా ఏడు గంటల పాటు బ్యాటింగ్ చేసి కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చండిమల్ కూడా నిలకడను చూపడంతో ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 130 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు. అయితే చండిమల్ అవుటైన తర్వాత లంక ఇన్నింగ్స్‌లో తడబాటు మొదలైంది. సహచరులు అవుటవుతున్నా... సంగక్కర మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు.