ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
భూమికి పచ్చాని రంగేసిన ట్టో అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
ఆలి పుస్తెలమ్ముకొని
అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
వలవలవల ఏడ్చుకుంటూ
వలసెల్లిపోతివో అమ్మలాలా
పురుగులమందే నీకు
పెరుగన్నమాయనో అమ్మలాలా
చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో
పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో
॥
చరణం : 1
జాతరమ్మ జాతరమ్మ
కూలిజనం జాతరో అమ్మలాలా
ఎత్తుపల్లాలనే చదును చేసే జాతరో అమ్మలాలా
చేలు దున్ని చాళ్లుదీసె
బీదబిక్కి జాతరో అమ్మలాలా
ఎద్దుకొమ్మల నడుమ ఎర్రపొద్దు పొడిచెరో
భూస్వామి గుండెలధర గుడిసెలోల్ల జాతర
॥
చరణం : 2
చెమట జల్లు చిలకరిస్తే
నేల పులకించురో అమ్మలాలా
వానొస్తే భూతల్లి శీమంతమాడురో అమ్మలాలా
తంగెళ్లు గన్నేర్లు
పసుపు కుంకుమిచ్చురో అమ్మలాలా
పశుల మెడన చిరుగజ్జెలు ఘల్లున మ్రోగేనో
గజ్జెల మోతల్లో పల్లె పరవశించెను
॥
చరణం : 3
ఎగువ పెన్నమ్మమతల్లి
ఎగిరెగిరి దుమికితే అమ్మలాలా
తుంగభద్రమ్మ పొంగి
పరవళ్లు తొక్కితే అమ్మలాలా
చిత్రంగ చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా
నేలతల్లి నీళ్లాడి పసిడిపంటలిచ్చురో
నా సీమకన్నుల్లో వెలుగులు నిండేనురో
॥
చిత్రం : శ్రీరాములయ్య (1998)
రచన : కలెకూరి ప్రసాద్
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : కె.జె.ఏసుదాస్, బృందం