ఎరువుల దుకాణంపై దాడి
గుడ్లూరు, న్యూస్‌లైన్ : లెసైన్స్ రెన్యువల్ చేయించుకోకుండా ఎరువులను అమ్ముతున్న దుకాణంపై కందుకూరు ఏడీఏ శేఖర్‌బాబు శనివారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేసి 6.28 లక్షల విలువైన 42 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. ఏడీఏ తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్లూరు మొయిన్ బజారులోని శ్రీసాయి ఫెర్టిలైజర్స్ ఎరువుల దుకాణం లెసైన్స్ గడువు రెండు నెలల క్రితం ముగిసింది. అప్పటి నుంచి షాపు యజమాని లెసైన్స్‌ను రెన్యువల్ చేయించుకోకుండా వివిధ రకాలైన ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న కందుకూరు ఏడీఏ శేఖర్‌బాబు శనివారం ఎరువుల దుకాణంపై దాడి చేశారు. దుకాణంలో ఉన్న రికార్డులు, స్టాకు రిజిస్టర్లను తనిఖీ చేశారు.
అనుమతి లేకుండా నిల్వ ఉన్న డీఏపీ, యూరియా, ఎస్ఎస్పీ, వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు 42 టన్నులు స్వాధీనం చేసుకుని వీఆర్వో పీరయ్య సమక్షంలో గోడౌన్‌ను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎరువుల విలువ రూ 6.28 లక్షలు ఉంటుందని ఏడీఏ తెలిపారు. దుకాణం యజమానిపై కేసు నమోదు చేసి జిల్లా కోర్టుకు సమర్పిస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమతి లేకుండా, లెసైన్స్‌లు రెన్యువల్ చేయించుకోకుండా ఎరువులు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ హెచ్చరించారు. ఏడీఏ వెంట మండల వ్యవసాయ అధికారి ఉన్నారు.