ఘనంగా కార్తీక పౌర్ణమి జాతర
దండేపల్లి, న్యూస్‌లైన్ :
దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఆదివారం భక్త జనసంద్రంతో నిండిపోయింది. ఆలయంలో నిర్వహించిన కార్తీక పౌర్ణమి జాతరకు జిల్లాతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు సమీపాన గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపైన గల సత్యదేవున్ని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 1600 మంది దంపతులు సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు.
ఆలయం పైన, కింద రావి చెట్టు వద్ద భక్తులు కార్తీక వత్తులు కాల్చారు. సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు సమీపాన గల మరో ఎత్తయిన గుట్టపై గల అయ్యప్ప, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు గుట్ట కింద గల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాలను కూడా భక్తులు సందర్శించి పూజలు చేశారు. ఆలయం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. గోదావరి నది వద్ద మహిళలు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలను గోదావరిలో వదిలి పెట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు, ఆలయ వ్యవస్థాపక కుటుంబసభ్యులు గోవర్ధన వెంకటస్వామి, ఈవో పురుషోత్తమాచార్యులు ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బంది చంద్రశేఖర్, సూర్యనారాయణ, కేవీ సత్యనారాయణ, అంజయ్య, సువర్ణ, తిరుపతి, పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
లక్సెట్టిపేట సీఐ సతీశ్‌కుమార్, దండేపల్లి, జన్నారం, ల క్సెట్టిపేట ఎస్సైలు శ్రీనివాస్, సత్యనారాయణ, లతీఫ్ ఆ ధ్వర్యంలో 20 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్లు, మరో 100 మంది పోలీసు సిబ్బంది, భారీ బందోబస్తు నిర్వహించారు. గోదావరి నదీ స్నానాల వద్ద ప్రమాదాలు జరగక్కుండా జన్నారం ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీంలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
వాలంటీర్ల సేవలు
జాతర సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు లక్సెట్టిపేట సత్యసాయి సేవాసమితి, దండేపల్లి భారత్ నిర్మాణ్ వాలంటీర్లు, సేవలందించారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ వారు భక్తులకు ఉచితంగా మినరల్ వాటర్ సప్లయి చేశారు. దండేపల్లి ఆర్ఎంపీల సంఘం, దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.