అనుక్షణం.. రాగ మిళితం..
తెనాలి : శ్రీసీతారామ గానసభ 70వ వార్షిక సంగీతోత్సవాల్లో ఏడోరోజయిన ఆదివారం రాత్రి చెన్నైకు చెందిన సునీల్ ఆర్.గార్గ్యన్ తన గానంతో సభికులకు వీనులవిందు చేశారు. స్థానిక మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కళ్యాణమండపంలో జరిగిన ఈ కచేరీ ఆద్యంతమూ హృద్యంగా సాగింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే గార్గ్యన్, అనుభవజ్ఞులైన సంగీత విద్వాంసుల తరహాలో సంస్కృతి సంప్రదాయాలు, రాగాలాపన, స్వరం మనోధర్మం వంటి అన్ని విషయాలు కలిసి ఆది నుంచి అంత్యం వరకు విశిష్టమైన రీతిలో కచేరీని రక్తికట్టించటం విశేషం. తొలుత వర్ణంను తోడిరాగం, ఆదితాళంలో ఆలపించాక, శ్రీమహాగణపతే...ను బేగడ రాగం రూపక తాళంలో పాడి కరతాళధ్వనులను అందుకొన్నారు. దర్బార్రాగంలో మిశ్రచాపు తాళంలో పాడిన ‘రామాభిరామ’ కీర్తనతో మంత్రముగ్ధులను చేశారు. రెండున్నర గంటల సేపు వివిధ కీర్తనలను గానం చేసి, అందరి ప్రశంసలను అందుకొన్నారు. వీరికి వయొలిన్పై వెటరన్ పుదక్కొటై రామనాథన్, మృదంగంపై ఐ.పినాకపాణిలు గొప్ప కూర్పుతో చక్కని సహకారం అందించారు. గానసభ అధ్యక్షుడు డాక్టర్ పిరాట్ల నారాయణమూర్తి తొలుత గార్గ్యన్ను పరిచయం చేశారు. సంగీత కళాచార్య పీఎస్ నారాయణస్వామి, పీబీ రంగాచార్యుల వద్ద సంగీత అభ్యాసం చేసిన గార్గ్యన్, మదంగంలోనూ పండితులే. పిన్నవయసునుంచి సంగీత సాధనతోనే ఇంతటి ప్రావీణ్యం అలవడింది. ప్రస్తుతం బీ గ్రేడ్ ఆర్టిస్టుగా వున్నారు. కార్యదర్శి డాక్టర్ వ్యాకరణం వెంకట్రావు, ఇతర సభ్యులు పర్యవేక్షించారు.
ఘనంగా సాగిన మేఘనామూర్తి గానం...
సంగీతోత్సవంలో భాగంగా శనివారం రాత్రి బెంగళూరుకు చెందిన మేఘనామూర్తి తన గానంతో శోత్రల అభినందనలు అందుకున్నారు. రెండున్నర గంటలసేపు సాగిన కచేరీ అనంతరం, పిన్నవయసులోనే అపార పాండిత్యం సాధించిందని ప్రశంసలు పొందారు.