అశ్వవాహనంపై ఆనంద నిలయుడు
తిరుమల: తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం శ్రీవేంకటేశ్వరుడు మహారథం (తేరు)పై భక్తులను అనుగ్రహించాడు. గుర్రాలు వంటి ఇంద్రియాలు మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామివారు ఈ రథోత్సవం ద్వారా భక్తులకు సందేశమిచ్చారు.చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోవిందా.. గోవిందా.. అంటూ మహారథం మోకు (తాడు)ను లాగుతూ భక్తి తన్మయత్వం చెందారు. వాహన సేవ తర్వాత సుమారు గంట పాటు పండితులు నిర్వహించిన వేదగోష్టితో తిరుమల సప్తగిరులు పులకించాయి.
టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి రథం లాగారు.రాత్రి చల్లటి గాలుల మధ్య మలయప్ప స్వామి అశ్వవాహనంపై భక్తులను పరవశింపజేశారు. బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలు, విశేష పుష్పాలంకరణానంతరం స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మరథం, గజ, అశ్వ, తురగ, చతురంగ బలాలు ముందుకు సాగగా జానపద కళాకారులు, భజన బృందాలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.
నేడు చక్రస్నానం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ముగిశాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం తెల్లవారుజాము 3 నుంచి ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.