పంచలోహ విగ్రహాలు చోరీ...
- దొంగలను పట్టుకున్న రైతులు
వల్లూరు(మహబూబ్నగర్ జిల్లా)
మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, విలువైన వెండి, బంగారు ఆభరణాలను దొంలించిన దొంగలను ఆదివారం ఉదయం రైతులు పట్టుకున్నారు. వారికి దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు.
శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలుపడి 3 పంచలోహ విగ్రహాలతోపాటు బంగారు,వెండి ఆభరణాలు చోరీచేశారు. చోరీ విషయం గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను రైతులు పట్టుకుని ప్రశ్నించడంతో వారే దొంగతనం చేశారని అంగీకరించారు.
దాంతో వారికి దేహశుద్ధిచేసి కొండాపురం పోలీసులకు అప్పగించారు. శ్రీవేణుగోపాలస్వామి ఆలయం నల్లసోమనాద్రి కాలం నాటిదని, పంచలోహ విగ్రహాలు 150 సంవత్సరాలనాటివని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.