చిన్న శేషుడిపై కల్యాణ వెంకన్న
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం స్వామివారు చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని ఉదయం అర్చకులు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యపూజా కైంకర్యాలు చేశారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించారు.
వాహన మండపంలో స్వామివారిని పట్టు వస్త్రాలు, వివిధ బంగారు ఆభరణాలతో సర్వాంగసుందరంగా ముస్తా బు చేశారు. అలంకరభూషితులైన స్వామివారిని చిన్న శేషవాహనంపై కొలువుంచి పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల గోవిందనామస్మరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు విహరించారు. దారిపొడవునా స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిం చారు. అనంతరం ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం సేవ నిర్వహించారు.
ఆకట్టుకుంటున్న కేరళ వాయిద్యాలు
తుమ్మలగుంటలో కల్యాణ వెంకన్న బ్ర హ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సా గుతున్నాయి. ఊరంతా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. వాహన సేవల ముందు అశ్వా లు, వృషభాలు, గోమాతలు గంభీరం గా నడుస్తుండగా కోలాటాలు, వేషధారణలు వేలాదిమంది భక్తుల గోవింద నామస్మరణలతో గ్రామం ఆధ్యాత్మిక భక్తిభావం వెల్లివిరుస్తోంది. కేరళ నుంచి వచ్చిన పదిమందితో కూడిన బృందం వాయిద్య విన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
హంస వాహనంపై స్వామివారు
రాత్రి హంస వాహనసేవ కన్నుల పండువగా జరిగింది. భక్తుల గోవిందనామస్మరణలు, భజన బృందాల సాంస్కృతిక సమ్మేళనం నడుమ శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణవెంకన్న మాడవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, ఈవో సుబ్బరామిరెడ్డి, సర్పంచ్ జయలక్ష్మి, ఉపసర్పంచ్ గోవిందరెడ్డి, కార్యదర్శి వెంకటప్ప, ప్రసాద్, ఆలయాధికారులు, అధిక సంఖ్యలో భక్తులు తది తరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం 7 గంటలకు సింహ వాహనం, సాయంత్రం 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.