నేడు పోలీస్‌స్టేషన్‌కు ‘గంగాభవానీ’
38 సంవత్సరాలుగాతొలి పూజలందుకుంటున్న అమ్మవారు
జాతరోత్సవాలు ప్రారంభం
కోడూరు, న్యూస్‌లైన్ : అమ్మవారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుందని ఆశ్చర్యపోతున్నారా.. అసలు అమ్మవారికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ కథ ఒకసారి చదవాల్సిందే.. కోడూరులో 500 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీగంగాభవానీ అమ్మవారికి అప్పట్లో ఆలయాన్ని గ్రామస్తులు కట్టించి పూజలు నిర్వహించేవారు. 39 సంవత్సరాల క్రితం కోడూరు ఎస్ఐగా పనిచేసిన ఏవీఎస్ రెడ్డి చోరవ తీసుకుని, ఆలయ కమిటీతో కలసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
అప్పటి నుంచి అమ్మవారి జాతరోత్సవాల ప్రారంభం నాడు పుట్టింటివారైన కంచర్లపల్లి వంశీయులు నూతన వస్త్రాలు సమర్పించిన తరువాత తొలి పూజలు నిర్వహించేందుకు అమ్మవారిని పోలీస్‌స్టేషన్‌కు ప్రత్యేక వాహనంపై తీసుకెళ్తారు. స్టేషన్‌హౌస్ ఆఫీసర్‌గా ఇక్కడ ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నా... అమ్మవారిని తమ సిబ్బంది డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లి, ప్రత్యేక పూజలు అందిస్తారు.
శుక్రవారం ఉదయం అమ్మవారికి కంచర్లపల్లి వంశీయులు పసుపు కుంకుమలు సమర్పించిన అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి 39వ జాతరోత్సవాలను ప్రారంభించనున్నట్లు ఆలయ ధర్మకర్త కోట యుగంధరరావు తెలిపారు. పోలీసుస్టేషన్లో పూజలు పూర్తయినతరువాత అమ్మవారిని కోడూరు శివారు గ్రామాలైన స్వతంత్రపురం, దింటిమెరక, మెరకగౌడపాలెం, కృష్ణాపురం, నరసింహపురం, ఇస్మాయిల్‌బేగ్‌పేట, యర్రారెడ్డిపాలెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
31వ తేదీన పశువుల జాతర, ఏప్రిల్ 1వ తేదీన ఆలయ ప్రధాన గుడి సంబరం నిర్వహించనున్నట్లు యుగంధరరావు తెలిపారు. రెండవ తేదీ ఉదయం చినఅమ్మవారిని ఆలయ ప్రవేశం చేయించడంతో జాతరోత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. జాతరోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రంగులతో నయనమనోహరంగా తీర్చిద్దితున్నారు.