క్యాన్సర్‌పై సర్వే
లావేరు : మండలంలోని మెట్టవలసలో క్యాన్సర్ వ్యాధి ప్రబలడానికిగల కారణాలపై త్వరలో శ్రీకాకుళం రిమ్స్ వైద్యులతో సర్వే జరిపిస్తామని రణస్థలం క్లస్టర్ ఎస్పీహెచ్వో కె.సి.చంద్రానాయక్ చెప్పారు. ఏడాది వ్యవధిలో ఈ గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో 8 మంది మృతి చెందగా, మరో ఇద్దరు క్యాన్సరుతో బాధపడుతున్న విషయంపై ‘కబళిస్తున్న క్యాన్సర్’ శీర్షికన ఈ నెల 23న సాక్షి ప్రచురించిన కథనానికి ఎస్పీహెచ్వో స్పందించారు. ఈ మేరకు మంగళవారం లావేరు పీహెచ్సీ వైద్యాధికారి ఎం.సంధ్య, ఎపిడమిక్ పెథాలజిస్టు కె. కొండయ్యరాజు, ఎపిడమిక్ కన్వీనర్ పి.మోజేష్, హెచ్వీ హేమకుమారి, ఆరోగ్యమిత్ర కె.సుబ్రమణ్యం, ఏఎన్ఎం సరోజినితో కలిసి మెట్టవలస గ్రామాన్ని సందర్శించారు.
వైద్యాధికారి, వైద్య సిబ్బంది తొలుత గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించి ప్రస్తుతం క్యాన్సర్ బాధితుల వివరాలు, మృతుల వివరాలు సేకరించారు. అనంతరం గ్రామంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న మీసాల సుశీల ఇంటికి ఎస్పీహెచ్వో, వైద్యాధికారి వె ళ్లి ఆమె వైద్య రిపోర్టులు పరిశీలించారు. క్యాన్సర్‌తో చిన్న వయస్సులోనే మృతి చెందిన నొడగల రమణ ఇంటికి వెళ్లి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య రిపోర్టులు ఇమ్మని అడుగగా అప్పుడే వాటిని కాల్చివేశామని రమణ కుటుంబసభ్యులు చెప్పారు.
అలాగే క్యాన్సర్‌తో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి ఎలా చనిపోయారో అడిగితెలుసుకున్నారు. ఆనంతరం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యం, మంచినీటి బోర్లను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వంటకాలను పరిశీలించారు. గ్రామంలో వ్యాధి ప్రభలడానికి గల కారణాలపై ఎస్పీహెచ్వో వైద్య సిబ్బందితో సమీక్షించారు. వ్యాధి ఎందుకు ప్రబలుతుందో తెలియజేయాలని గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యువజన సంఘం అధ్యక్షుడు నారాయణరావు, గ్రామస్తులు మీసాల సత్యం, పిన్నింటి రమణ తదితరులు కోరగా, త్వరలో రిమ్స్ వైద్యులతో గ్రామంలో సర్వే చేస్తామని ఎస్పీహెచ్వో చెప్పారు.