లక్షణాలతో ఔషధం - స్వైన్ఫ్లూ దూరం
స్వైన్ ఫ్లూ... హోమియో చికిత్
హోమియో వైద్యవిధానంలో రోగలక్షణాలతోబాటు వ్యక్తిగత లక్షణాలను బట్టి మందును సూచిస్తారు. కాబట్టి స్వైన్ ఫ్లూ వ్యాధికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. హోమియో మందులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. తద్వారా చికిత్సతోపాటు... నివారణ కోసం కూడా ఈ మందులను ఉపయోగించవచ్చు. ఈ వ్యాధి కోసం ఉపయోగించి మందుల్లో ముఖ్యమైనవి...
ఇన్ఫ్లుయెంజినమ్: ఇది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ద్వారా తయారైన మందు. స్వైన్ఫ్లూ వ్యాధి నివారణిగా ప్రధానంగా వాడదగిన ఔషధం. ఫ్లూ లక్షణాలు, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒళ్లునొప్పులు, అలసట, గొంతునొప్పి, చలిజ్వరం, విరేచనాలు, వాంతులు మొదలైన ఫ్లూ జ్వర లక్షణాలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఇంతకుముందు వచ్చిన సాంక్రమిక వ్యాధుల వల్ల వచ్చే జ్వరం పూర్తిగా తగ్గనప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది. మలవిసర్జన సమయంలో కడుపునొప్పి, మనోవ్యాకులత, మానసికంగా బాధపడటం, గనేరియా వ్యాధి చరిత్ర కలిగి ఉన్నవారికి ఇన్ఫ్లుయెంజినమ్ ఔషధం చక్కగా పనిచేస్తుంది.
జెల్సీమియం: నీరసం, మైకం, మగత ఈ ఔషధ లక్షణం. కండరాల నొప్పులు, నిరంతర చల్లదనం, అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు తీవ్రంగా ఉండటం, హఠాత్తుగా వచ్చే తుమ్ములు, ముక్కు నుంచి స్రావం, చర్మం ఒరుసుకుపోయినట్లుగా అవడం, ఉదాసీనత వల్ల శ్వాస నెమ్మదిగా ఆడటం వంటి లక్షణాలు ఉన్నవారికి జెల్సీమియం చక్కగా పనిచేస్తుంది.
బాప్టీషియా: ఫ్లూ జ్వరంతో పాటు జీర్ణాశయానికి సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే బాప్టీషియా ప్రయోజనకరమైన ఔషధం. ముఖ్యంగా విరేచనాలు భరింపరాని, కుళ్లిన వాసన కలిగి ఉండటం, విశ్రాంతి తీసుకున్నా శరీరమంతా పుండులా అనిపించడం, బలహీనత, జ్వరం హఠాత్తుగా పెరగడం, ముఖం కమిలిపోవడం, శారీరక-మానసిక బలహీనత, శ్వాసతీసుకోవడం ఇబ్బంది, వీపు భాగంలో చలి, ద్రవపదార్థాలు తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నవారికి బాప్టీషియా మందు చక్కగా పనిచేస్తుంది.
ఆర్సినికం ఆల్బమ్: చలి, వేడి ఆవిర్లు, రొంప, తుమ్ములు, ముక్కు నుంచి స్రావాలు, ఆందోళన, భయం, దాహం, తరచూ నీళ్లు తాగాలనిపించడం, బలహీనత, ఏదైనా తిన్న లేదా తాగిన వెంటనే మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, ఆహారం వాసన కూడా వికారం కలిగించడం, మంటతో కూడిన ఒళ్లునొప్పులు ఉన్నవారికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది. ఆర్స్-ఆల్బ్ రోగులు వ్యాధి పట్ల భయం కలిగి ఉంటారు. వ్యాధి తమకే వస్తుందనే భయం, ఆందోళన, ఒక్కచోట కుదురుగా ఉండలేక అటు-ఇటు తిరగడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు.
రస్టాక్స్: ఫ్లూ జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లునొప్పులు, తుమ్ములు, దగ్గు (ముఖ్యంగా సాయంకాలం ఎక్కువగా ఉండటం), చల్లటి వాతావరణం, తేమ వాతావరణంలో బాధలు ఉద్రేకించడం, నీరసం, మాంద్యం, రోగికి టైఫాయిడ్ జ్వరాన్ని పోలిన లక్షణాలు ఉండటం, ముఖ్యంగా నాలుక మంట, మైకం, పిచ్చిగా మాట్లాడటం, రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం, దగ్గు కారణంగా ఛాతీలో మంట, కొన్నిసార్లు అసంకల్పితంగా మూత్రవిసర్జన వంటి లక్షణాలు ఉన్నవారికి రస్టాక్స్ చాలా ప్రయోజనకరమైన ఔషధం.
యుపటోరియం: శరీరమంతా పుండులా విపరీతమైన నొప్పి కలిగినవారికీ, శ్వాసనాళంతో పాటు గొంతు పుండులా మారి దగ్గు, గొంతుబొంగురుపోవడం, రొంపతో పాటు విపరీతమైన దాహం ఉండటం, అయినప్పటికీ ద్రవపదార్థాలు తీసుకుంటే వాంతులు కావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు యుపటోరియం చక్కగా పనిచేస్తుంది.
అకోనైట్: కొద్దిపాటి ఫ్లూ జ్వరం లక్షణాలు ముఖ్యంగా ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం, ఇంకా ఏ ఇతర లక్షణాలు లేనప్పటికీ స్వైన్ఫ్లూ ఉందేమోనని ఆందోళన చెందిన రోగులకు అకోనైట్ వాడదగిన ఔషధం.
డా. శ్రీకాంత్ మోర్లావర్, ఇకఈ
హోమియోకేర్
ఇంటర్నేషనల్