విద్యానృసింహ స్వామికి వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్: పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యానృసింహ భారతీస్వామి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం శ్రద్ధాంజలి ఘటించారు. బేగంపేటలో పుష్పగిరి భారతి వేద పాఠశాలలో ఉంచిన భారతీస్వామి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం 3.45కి బషీర్బాగ్ అపోలో ఆస్పత్రిలో భారతీస్వామి తుది శ్వాస విడిచారు. కడప జిల్లా పుష్పగిరిలోని కేంద్ర స్థానంలోమంగళవారం శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు జరుగుతాయని స్వామి వ్యక్తిగత కార్యదర్శి ఎన్.భారతీస్వామి తెలిపారు.
కడపజిల్లా చెన్నూరులో 1940లో జన్మించిన భారతీస్వామి 1957లో పుష్పగిరి పీఠం బాధ్యతలు చేపట్టారు. దక్షిణ భారత దేశంలోనే సుదీర్ఘంగా 60 ఏళ్ల పాటు కొనసాగిన ఏకైక పీఠాధిపతిగా ఘనతకెక్కారు. పీఠాధిపతిగా అరవయ్యో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ‘షష్ట్యబ్ది ఉత్సవం’ చేయాలని పూనుకున్న తరుణంలో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు.