వైల్డ్ ఫోటోగ్రఫీ
ఫొటో అనగానే స్మైల్ ప్లీజ్ అనడం కామన్. కానీ ఈ ఫొటో షూట్లో.. ఇటు చూడు.. నవ్వు.. కాస్త ఫేస్ టర్నింగిచ్చుకో ఇవన్నీ ఉండవు. సెలైంట్‌గా పని కానిచ్చేయాలి. చీమ చిటుక్కుమన్నా.. ఫొటో ఫట్. ఇంతకీ ఇదేం ఫొటో షూట్ అనుకుంటున్నారా..? అదే ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ’. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై మెట్రోవాసుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
రాజసం ఉట్టిపడే సింహాన్ని ఫొటో తీయాలంటే గట్స్ ఉండాలి. అంతకు మించి ఆ మృగరాజు.. అలాంటి ఫోజు పెట్టాలంటే గంటలు కాదు, ఒక్కోసారి రోజులకు రోజులు వేచి చూసే ఓపిక ఉండాలి. లిప్తపాటులో మారిపోయే హావభావాల్లో మన్నికైనది ఎన్నుకొని క్లిక్ మనిపించాలి. అప్పుడే ఆ ఫొటో కలకాలం నిలిచిపోతుంది. అలాంటి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో ప్రత్యేకత చాటుకుంటున్నారు నగరానికి చెందిన వెంకట రాంనర్సయ్య. వృత్తిరీత్యా వైద్యుడైనా.. ప్రవృత్తిగా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీతో అద్భుతాలను కెమెరాలో బంధిస్తున్నారు. దేశంలోని అన్ని జాతీయ పార్కులను ఆయన సందర్శించారు. ఆయన తీసిన దాదాపు 400కు పైగా వైల్డ్‌లైఫ్ ఛాయాచిత్రాలను ‘ఢిల్లీ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో ప్రదర్శించారు. ఇటీవలే మధ్యప్రదేశ్ కన్హా నేషనల్ పార్క్ పర్యటించారు. ఈ సందర్భంగా ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ’ అనుభవాలను ఆయన ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.
ప్రకృతితో మాట్లాడొచ్చు...
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఓ జంతువు హావభావాలే కాదు.. అక్కడి పరిసరాలను, ప్రకృతిని కూడా కెమెరాలో బంధించాలి. ప్రకృతితో మాట్లాడే అవకాశం ఈ ఫొటోగ్రఫీలోనే ఉంది. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నా. ప్రాణాలను రిస్క్ చేసి క్రూర మృగాలు, వాటి హావభావాలను ఫొటో తీయాలంటే ముందుగా కెమెరా, లెన్స్ మీద అవగాహన ఉండాలి. ఐఎస్ఓ ఫిలిప్ స్పీడ్ ఉన్న హై రిజల్యూషన్ కెమెరాలనే వినియోగించాలి. వీటి ధర రూ.10-20 లక్షలుంటుంది.
ఫ్లాష్ వేశామో గోవిందా...
ఈ ఫొటోగ్రఫీ పూర్తిగా నేచురల్ లైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. పొరపాటున ఫ్లాష్ వేశామో.. వాటి హావభావాలు మారడమే కాదు, ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. జంతువుల్లో వినికిడి శక్తి ఎక్కువ. కొన్ని శ్వాసను కూడా పసిగడతాయి. పక్షులైతే ఇలా వెళ్తే అలా తుర్రుమంటాయి.
జంతువులపై రీసెర్చ్
ఈ ఫీల్డ్‌లో ఉన్నవారికి జంతువుల కదలిక, ఆహారపు అలవాట్ల గురించి పూర్తిగా తెలిసుండాలి. కాలాలు, సమయాన్నిబట్టి వాటి హావభావాల్లో మార్పులుం టాయి. పులులు, సింహాలు వంటి క్రూర మృగాల ఫొటోలు తీయడానికి వేసవి అనుకూలం. అందులోనూ మధ్యాహ్నం వేళలో ఆకలిగా ఉంటాయి. ఆ టైమ్‌లో వాటి ముఖాల్లో ఆకలి, కోపం వంటి షేడ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. వేసవిలో నీళ్ల కోసం ఇతర జంతువులు బయటకు వస్తుంటాయి. వీటిని వేటాడటం కోసం క్రూర మృ గాలు పొదల చాటున మాటేసి ఉంటాయి. ఇట్లాంటి ఫొటోలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. వర్షా కాలంలో పక్షులు, జలచరాల ఫొటోలు తీయవచ్చు. ఈ కాలంలో పచ్చటి ప్రకృతితో పాటు పక్షుల అందాలను కెమెరాలో బంధించవచ్చు.
- శ్రీనాథ్ ఆడెపు