ఎర్రబెల్లికి గుణపాఠం చెబుతాం:వంగపల్లి
ముషీరాబాద్: దళిత నేత, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని అవమానించే విధంగా పదేపదే మాట్లాడుతున్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మాదిగలు తగిన గుణపాఠం చెబుతారని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. గురువారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి ద్రోహం చేసిన ఎర్రబెల్లికి కడియం శ్రీహరిని విమర్శించే హక్కు లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితుడు ఉప ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకే ఎర్రబెల్లి ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇకపై విమర్శలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దండు సురేందర్, గడ్డం అంజన్న, విజయరాజు, ఇటుక గోపి, పొన్నాల కుమార్, మనోజ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.