పెద్ద ఆశయం.. చిరు ప్రయత్నం..
వ్యవస్థను తిడుతూ కూర్చొనే కన్నా దాన్ని మార్చడానికి ఏం చేయాలన్నది ఆలోచించడమే ఎవరైనా చేయాల్సిన పని. ఓటర్లలో ఆ చైతన్యం కలిగించడా నికి ఓ కాలేజీ కుర్రాడు ‘నేను సైతం...’ అంటూ ప్రయత్నించాడు. బి.టెక్ రెండో సంవత్సరం విద్యార్థి శ్రీపాద్ సాయినందన్ తాజా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ‘మీ ఓటు ఎవరికి?’ అంటూ ఓ లఘుచిత్రం రూపొందించాడు. ‘‘మా స్నేహితులు సిద్ధార్థ, విక్రమ్‌లతో కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను.
ఒక్కరోజులో షూటింగ్ పూర్తిచేశాను’’ అని చెప్పాడీ కుర్రాడు. హైదరాబాద్‌లో ముఫఖంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో చదువుతున్న శ్రీపాద్‌కు ఇంటి చుట్టుపక్కల ఉన్న మురికివాడలలో నివసించే వారిని చూశాక, ఈ చిత్రం తీయాలనిపించిందట. గతంలో ఒక లఘుచిత్రం తీసి, అనేక లఘుచిత్రాలలో నటించిన అనుభవం అందుకు పనికొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ తరఫున అండర్ 19కి క్రికెట్ ఆడే శ్రీపాద్ తీసిన ఈ తాజా లఘుచిత్రంలోని పాత్రధారులంతా అతని స్నేహితులు, బంధువులే. ‘‘మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. అయితే సాయంత్రానికల్లా పూర్తిచేసుకోమనీ, రాత్రుళ్లు బయటకెళ్లవద్దనీ సూచించారు’’ అని నవ్వుతూ చెప్పాడీ యువకుడు. ‘‘ఓటు హక్కును వినియోగించుకొమ్మంటూ యువతను మేల్కొల్పడమే ఈ చిత్ర రూపకల్పన ఉద్దేశం’’ అన్నాడు. వయసు చిన్నదైనా సమాజం కోసం తన వంతుగా ఈ యువకుడు చేసిన ప్రయత్నం ప్రశంసనీయమే.
- డా.వైజయంతి