నాన్న అన్న ఆ ఒక్క మాటే అతి పెద్ద కాంప్లిమెంట్: శ్రీపతి కర్రి
‘కోరమీను’ సినిమా చూసిన తర్వాత మా నాన్న ఫోన్ చేసి ‘ఈ రోజుతో మా బెంగ, బాధ, భయం అన్నీ తీరిపోయాయిరా’అన్నాడు. ఆ ఒక్కమాటే నా జీవితంలో అందుకున్న అతిపెద్ద కాంప్లిమెంట్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్’అని యంగ్ డైరెక్టర్ శ్రీపతి కర్రి అన్నారు. ఆయన దర్శకత్వంలో ఆనంద్ రవి, కిషోరి జంటగా నటించిన చిత్రం ‘కొరమీను’. ‘స్టోరీ ఆఫ్ ఈగోస్’ అనేది ఉపశీర్షిక. ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సమన్యరెడ్డి పెళ్లకూరు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 31న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. ‘కొరమీను’ చిత్రం ఇంత బాగా రావడంలో ఈ చిత్ర రచయిత, హీరో అయిన ఆనంద్ రవి, నిర్మాత సమన్య రెడ్డిలకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
‘సినిమాపై పిచ్చితో 2006లో తాను హైదరాబాద్‌కు వచ్చాను. మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. పస్తులుండాల్సి వచ్చిన రోజుల్ని... సినిమా రంగంలో సక్సెస్ కావడానికి నేను చేస్తున్న ఉపవాసాలుగా భావిస్తుండేవాడిని. 2020లో హల్చల్ చిత్రానికి దర్శకత్వం వహించాను .ఆ చిత్రంతో మంచి పేరు వచ్చినా.. తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కోడైరెక్టర్‌గా పనిచేయాల్సి వచ్చింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కోరమీనుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన రావడం ఆనందంగా ఉంది. త్వరలోనే మరో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించబోతున్నాను’అని శ్రీపతి కర్రి అన్నారు.