రాజన్న సన్నిధిలో రాములోరి పెళ్లి
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు 3 లక్షల మందికిపైగా భక్తులు శుక్రవారం రాత్రికే వేములవాడకు చేరుకోవడంతో అధికారులు రాత్రంతా దర్శనాలకు అనుమతించారు. ప్రభుత్వం తరఫున ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు పట్టువస్త్రాలు సమర్పించారు. ఎదుర్కోళ్ల సమయంలో వధూవరుల పక్షాన కట్నకానుకలు మాట్లాడుకున్నారు. రూ.1.12 కోట్ల మేర కట్నాల ఒప్పందం కుదిరింది.
ఉదయం 11.40 గంటలకు కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కన్యాదాతలుగా పార్థసారథి- కరుణశ్రీ దంపతులు వ్యవహరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివపార్వతులు నెత్తిన జీలకర్ర, చేతిలో త్రిశూలం పట్టుకుని అక్షింతలు చల్లుకుంటూ రాజరాజేశ్వరుడిని వివాహమాడారు. కల్యాణం అనంతరం దర్శన సమయంలో తోపులాట జరిగింది. భక్తులు తాగునీటికి తిప్పలుపడ్డారు. కాగా, రాములోరి కల్యాణం సందర్భంగా వేములవాడలో రాజన్నను శివపార్వతులు వివాహం చేసుకోవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తుండగా, ఈసారి తమకు ప్రాధాన్యత కల్పించలేదని, ఇలా చేస్తే వచ్చే ఉత్సవాలకు తాము వేములవాడకు రామని జోగిని శ్యామల అధికారుల తీరుపై మండిపడ్డారు.