రాఘవేంద్రుడికి వెంకన్న పట్టువస్త్రాలు
మంత్రాలయం (కర్నూలు జిల్లా): ప్రముఖ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యారాధన వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల నేతృత్వంలో రాయరు మూలబృందావనానికి మహా పంచామృతాభిషేకం చేపట్టారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు కనకాభిషేకం, రాఘవేంద్రుల ప్రతిమను నవరత్నరథంపై కన్నులపండువగా ఊరేగించారు.
ఆనవాయితీలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈఓ సాంబశివరావు పట్టువస్త్రాలను రాఘవేంద్రులకు సమర్పించారు. గజరాజు, పూర్ణకుంభం సమేతంగా మంగళవాయిద్యాల నడుమ పీఠాధిపతి స్వాగతం పలికారు. పంచామృతాభిషేకం పూర్తయ్యాక మూలబృందావనాన్ని టీటీడీ పట్టువస్త్రాలతో అలంకరించారు. సోమవారం 70 వేలకుపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అంచనా. వేడుకల్లో భాగంగా నిర్వహించిన పూజోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.