srivari seva online
-
18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన కోటాను ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు, శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. -
‘శ్రీవారి సేవలు ఆన్లైన్ కాదు.. అంతా క్యాష్ లైనే’
సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి టీటీడీ పాలకమండలిపై విమర్శలు గుప్పించారు. లేని అధికారాన్ని చలాయిస్తున్న పాలకమండలి సభ్యుల తీరువల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ సేవలు పేరుకు మాత్రమే ఉన్నాయనీ, అంతా క్యాష్‌లైన్ వ్యవహారాలేనని ఆరోపించారు. పాలకమండలి సభ్యులకు కోటా విధానం ఉండడంతో ఆర్జిత సేవ టికెట్లు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. టీటీడీ పాలకమండలి సభ్యులకు ప్రోటోకాల్ విధానం రద్దుచేసి.. వారి కుంటుంబ సభ్యులకు మాత్రమే దర్శనాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీవేంకటేశ్వరుడి కటాక్షం వల్లనే తన ప్రాణాలు నిలిచాయని చెప్పుకునే చంద్రబాబు తిరుమల కొండపై జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని అన్నారు. కనీసం రిటైర్డ్ జడ్జితోనయినా విచారణ జరిపించాలని అన్నారు. ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై టీటీడీ బోర్డు అనాగరికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. శ్రీకృష్ణ దేవరాలయ కాలంలో మాదిరిగా దర్శనం చేసుకుంటున్న భక్తులను నెట్టివేస్తున్నారని వాపోయారు. ఆపదమొక్కులవాడు.. శ్రీవేంకటేశ్వరుడు తమని ఆదుకుంటాడని భక్తులు కొండకు వస్తుంటే.. దేవుడి నగలు, వజ్రాభరణాలు పోయాయనే ప్రచారం ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. సమాచార హక్కు చట్ట పరిధిలోకి శ్రీవారి ఆలయాన్ని తీసుకురావాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. -
తిరుమలలో 9వ తేదీ నుంచి వరుణ యాగం
తిరుపతి : తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లు ఆన్లైన్లో నేటి నుంచి విక్రయిస్తున్నట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. నవంబర్ 5వ తేదీ వరకు ఈ ఆన్లైన్ టిక్కెట్లు విక్రయిస్తామని తెలిపారు. శుక్రవారం తిరుపతిలో సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు పార్వేటి మండపంలో వరుణ యాగాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే బ్రహ్మోత్సవాల పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. 8 లక్షల లడ్డూలు అదనంగా నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డి. సాంబశివరావు వివరించారు. గతంతో పోలిస్తే తిరుపతిలో భక్తులు గదుల వినియోగం 109 శాతం పెరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. దీనికి లాస్ట్ అండ్ ఫౌండ్ అని పేరు పెట్టినట్లు ఆయన విశదీకరించారు. టీటీడీలో ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. అయితే టీటీడీలో ఉద్యోగాలు అంటూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఈ సందర్భంగా డి.సాంబశివరావు సూచించారు.