రేపు డెల్టా పరిరక్షణ సదస్సు
భీమవరం: తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై చేపడుతున్న ఎత్తిపోతల పథకాల కారణంగా మన రాష్ట్రంలోని డెల్టా ప్రాంతాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తు భీమవరంలో డెల్టా పరిరక్షణ సదస్సు ఏర్పాటుచేస్తున్నట్టు రైతు కార్యాచరణ సమితి గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ యర్రా నారాయణస్వామి చెప్పారు. బుధవారం స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని, నీటివనరులు నిపుణులు డాక్టర్ పీఏ రామకష్ణంరాజు, నీటిపారుదలశాఖ రిటైర్డ్ ఎస్ఈ హరినా«థ్, రైతు నాయకుడు భవానీప్రసాద్ పలువురు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు.
ఎత్తిపోతల పథకాల ద్వారా కోటి ఎకరాలకు తెలంగాణలో నీరందించేందుకు ఆ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గోదావరి అథారిటీ తక్షణం స్పందించి గోదావరి డెల్టాను స్థిరీకరించకపోతే ఏర్పడే ఇబ్బందులను సదస్సులో చర్చిస్తామన్నారు. వెట్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.రామకృష్ణంరాజు, రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు, కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, కోశాధికారి పాతపాటి మురళీరామరాజు పాల్గొన్నారు.