హైదరాబాద్ బౌలర్లు విఫలం
ఇండోర్: సీకే నాయుడు ట్రోఫీ అండర్-25 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో దీటైన జవాబిచ్చింది. మూడో రోజు ఆటలో మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్ ఎస్.ఎస్.శర్మ (181 బంతుల్లో 104, 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కాడు.
ఓవర్‌నైట్ స్కోరు 5/0తో ఆదివారం ఆట ప్రారంభించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 94 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఓపెనర్లలో రిషబ్ తివారి (151 బంతుల్లో 97, 13 ఫోర్లు) తృటిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోగా, ఎస్.డి.చౌదరి 33 పరుగులు చేశాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అనంతరం తివారితో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ శర్మ జతకట్టగా ఈ జోడి రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించింది.
హైదరాబాద్ బౌలర్లు మూకుమ్మడిగా చేతులెత్తేయంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ చక్కటి షాట్లతో అలరించారు. ఏకంగా ఎనిమిది మంది బౌలింగ్‌కు దిగినప్పటికీ మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్‌ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు. ఎ.వి.సింగ్ (150 బంతుల్లో 79 బ్యాటింగ్, 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లు శబరీశ్, అస్కారి, రాయుడు రేవంత్ సాయి తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ జట్టు 135 పరుగులు వెనుకబడింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ జట్టు 471 పరుగులు చేసింది.