Ssangyong
-
శాంగ్యాంగ్ విక్రయానికి మహీంద్రా రెడీ
న్యూఢిల్లీ, సాక్షి: విదేశీ అనుబంధ సంస్థ శాంగ్యాంగ్ మోటార్ కంపెనీ(ఎస్‌వైఎంసీ)ను విక్రయించేందుకు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సన్నాహాలు చేస్తోంది. నష్టాలతో కుదేలైన ఈ దక్షిణ కొరియా అనుబంధ కంపెనీ ఇటీవలే దివాళా పిటిషన్‌తో పునరుద్ధరణకు దరఖాస్తును చేసుకుంది. కాగా.. ఎస్‌వైఎంసీలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలతో చర్చలు చేపట్టినట్లు ఎంఅండ్ఎం వెల్లడించింది. వచ్చే వారంలో వాటా అమ్మకంపై తప్పనిసరికాని(నాన్‌బైండింగ్) ఒప్పందాన్ని కుదుర్చుకునే వీలున్నట్లు వెల్లడించింది. (జేవీకి.. ఫోర్డ్, మహీంద్రాల ‘టాటా’) 75 శాతం వాటా కొరియన్ కంపెనీ శాంగ్యాంగ్ మోటార్లో దేశీ దిగ్గజం ఎంఅండ్ఎం ప్రస్తుతం 75 శాతం వాటాను కలిగి ఉంది. వాటా విక్రయ ఒప్పందం ఫిబ్రవరి చివరికల్లా పూర్తికావచ్చని అంచనా వేస్తోంది. గత నెలలో అంటే 2019 డిసెంబర్ 21న శాంగ్యాంగ్ మోటార్ దివాళా పిటిషన్ వేసిన విషయం విదితమే. నష్టాలు పెరిగిపోవడంతో దివాళా చట్ట ప్రకారం కంపెనీ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసింది. సియోల్ దివాళా చట్ట కోర్టు ఈ అంశంపై చర్యలు తీసుకోనుంది. ఇందుకు అనుగుణంగా స్వతంత్ర పునర్వ్యవస్థీకరణ మద్దతు(ఏఆర్ఎస్)కు సైతం శాంగ్యాంగ్ దరఖాస్తు చేసింది. ఏఆర్ఎస్లో భాగంగా కంపెనీ పునర్వ్యవస్థీకరణ కోసం సొంత ప్రయత్నాలు చేసుకునేందుకు వీలుంటుందని ఎంఅండ్ఎం ఎండీ పవన్ గోయెంకా పేర్కొన్నారు. ఇందుకు ఫిబ్రవరి 28వరకూ కోర్టు గడువిచ్చినట్లు చెప్పారు. దీంతో రెండు నెలల గడువు ముగిసేలోగా వాటా విక్రయానికి వీలుగా ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. (ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్- లిస్టింగ్ భళా) డీల్ కుదిరితే వచ్చే నెలాఖరులోగా ఎవరైనా ఇన్వెస్టర్ మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తే శాంగ్యాంగ్ మోటార్ తిరిగి యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుంటుందని గోయెంకా చెప్పారు. లేదంటే యాజమాన్యం కోర్టు చేతికి వెళుతుందని, దివాళా చట్ట ప్రకారం పునరుద్ధరణ చర్యలు ప్రారంభంకావచ్చని తెలియజేశారు. మార్చి 1లోగా డీల్ కుదిరితే కంపెనీలో కొత్త యాజమాన్యానికి మెజారిటీ వాటా బదిలీ అవుతుందని, సుమారు 30 శాతం మైనారిటీ వాటాతో ఎంఅండ్ఎం కొనసాగుతుందని విశ్లేషించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 25 శాతం పెట్టుబడుల కుదింపును కంపెనీ చేపడుతుందని తెలియజేశారు. 2010లో 2017 నుంచి నష్టాలు నమోదు చేస్తున్న శాంగ్యాంగ్ మోటార్‌ను 2010లో ఎంఅండ్ఎం కొనుగోలు చేసింది. తదుపరి 11 కోట్ల డాలర్ల(సుమారు రూ. 800 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసింది. 2019కల్లా నష్టాలు 341 బిలియన్ కొరియన్ వన్‌కు చేరాయి. దీంతో గత ఏప్రిల్‌లో ఎంఅండ్ఎం బోర్డు శాంగ్‌యాంగ్‌కు మరిన్ని నిధులను అందించేందుకు తిరస్కరించింది. ఫలితంగా 2020 డిసెంబర్‌కల్లా 60 బిలియన్ వన్(రూ. 400కోట్లకుపైగా) రుణ చెల్లింపుల్లో శాంగ్యాంగ్ విఫలమైంది. ప్రస్తుతం శాంగ్‌యాంగ్‌కు 100 బిలియన్ వన్(రూ. 680 కోట్లు) రుణభారమున్నట్లు తెలుస్తోంది. -
మహీంద్రా.. రెక్స్టన్ ఆర్ఎక్స్6
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారమిక్కడ భారత మార్కెట్లో సాంగ్యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్6 మోడల్‌ను ఆవిష్కరించింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో విలాసవంతమైన ఫీచర్లతో ఈ ఖరీదైన వాహనాన్ని రూపొందించింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.20.11 లక్షలు. ముందువైపు, ఇరు పక్కల కూడా ఎయిర్‌బ్యాగ్స్‌ను ఉంచారు. మలుపుల్లో, అలాగే కొండ ప్రాంతాల్లో వాహనం జారకుండా స్థిరంగా ఉండేలా వ్యవస్థ ఉంది. ప్రీమియం లెదర్‌తో ఇంటీరియన్‌ను తీర్చిదిద్దారు. టిల్ట్, ఓపెన్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్‌ను అమర్చారు. నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇప్పటికే రెక్స్టన్ నుంచి ఆటో ట్రాన్స్‌మిషన్‌తో ఆర్ఎక్స్7 (రూ.21.28 లక్షలు), మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఆర్ఎక్స్5 (రూ.19 లక్షలు) మోడళ్లున్నాయి. ఈ రెండు మోడళ్లలో లేని 17 రకాల ఫీచర్లను ఆర్ఎక్స్6లో పొందుపరిచారు. మరో ఆరు ఇంజిన్లపై.. సాంగ్యాంగ్తో కలిసి ఆరు ఇంజిన్ల తయారీలో నిమగ్నమైనట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సేల్స్ చీఫ్ అరుణ్ మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. వీటిని రెండు కంపెనీలూ వినియోగిస్తాయని, మూడేళ్లలో సిద్ధమవుతాయని చెప్పారు. హై ఎండ్, లగ్జరీ ఫీచర్లతో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్‌ను వినియోగదారులు కోరుతున్నందునే ఆర్ఎక్స్6ను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. హై స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల పరిమాణం దేశంలో 2013-14లో 23,665 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 26,208 యూనిట్లు. ఈ విభాగంలో మహీంద్రా రెండో స్థానంలో ఉంది.