సార్వత్రిక ఎన్నికల నగారా
నేటి నుంచి నామినేషన్లు
వేడెక్కుతున్న రాజకీయం
సాక్షి,చిత్తూరు : జిల్లాలో శనివారం సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఆయా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల్లో శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కనుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.
జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ జిల్లా వాసే కావటంతో వీరిద్దరికీ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అదే సమయంలో వైఎస్సార్సీపీ నుంచి జిల్లా నాయకులుగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. జిల్లాలో ముగ్గురు పోటీచేస్తుండడంతో జిల్లాలో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి.
మే7న జరగనున్న 16వ సార్వత్రిక ఎన్నికల్లో 29.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 6న మొదటి విడత, 11న (శుక్రవారం) రెండో విడత పరిషత్ ఎన్నికలు జరిగారుు. ఇక వెంటనే జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో అన్ని ప్రధాన రాజకీయపార్టీల నాయకులకు విశ్రాంతి కరువైంది. ఇదే అసలుసిసలైన ప్రధానపరీక్ష కావడంతో రాజకీయనాయకులు పరుగులుదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలో అసెంబ్లీ స్థానాలు : తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి, గంగాధరనెల్లూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లె, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, కుప్పం.
లోక్‌సభ నియోజకవర్గాలు : తిరుపతి (మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు), చిత్తూరు( ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు), రాజంపేట(నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు)
- నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల తొలిఘట్టానికి తెరలేచింది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు శనివారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం జిల్లా కలెక్టర్ శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. 19వ తేదీ వరకు పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవులు కావడంతో 13, 14, 18 తేదీలు మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి అందజేయాలి.