ఎస్పీ బదిలీ
నూతన ఎస్పీగా సెంథిల్‌కుమార్
నెల్లూరు(క్రైమ్): జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఎస్.సెంథిల్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ జేవీ రాముడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సెంథిల్‌కుమార్ తమిళనాడు నివాసి. 2008 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. వరంగల్ జిల్లా ములుగు ఏఎస్పీగా పోలీసుశాఖలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీకాకుళం ఏఎస్పీ, శంషాబాద్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది డిసెంబర్ 2న అనంతపురం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సెంథిల్‌కుమార్ విధినిర్వహణలో రాజీపడని అధికారిగా గుర్తింపు పొందారు. మరో రెండు, మూడు రోజుల్లో నెల్లూరు ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
విజయనగరం జిల్లాకు నవదీప్
నవదీప్‌సింగ్ గ్రేవాల్‌ను విజయనగరానికి బదిలీ చేశారు. 2008 బ్యాచ్‌కే చెందిన ఆయన జిల్లా ఎస్పీగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న బాధ్యతలు చేపట్టారు. గతంలో అనంతపురం, పార్వతీపురం, రంపచోడవరం, మంచిర్యాలలో ఏఎస్పీగా పనిచేశారు. మల్కాజ్గిరి డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నె ల్లూరు ఎస్పీగా వచ్చారు. రాష్ట్ర విభజన, ఎన్నికల సమయాల్లో పరిస్థితులు అదుపుతప్పకుండా సఫలీకృతులయ్యారు. అయితే శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పార్టీకి కొమ్ముకాశారనే విమర్శను మూటగట్టుకున్నారు.
సీఎం చంద్రబాబు 19వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ తర్వాత విధుల నుంచి రిలీవ్ అవుతారని సమాచారం.