రాకెట్ కంటే స్పీడుగా...
ఒకరికిమించిన ఆలోచనలు మరొకరివి... అందరి ఆలోచల్ని కలిపితే... ఇంకేముంది దిమ్మతిరిగే ప్రదర్శనలే...! చిన్నారులే కదా అంటే కుదరదు... రంగం ఏదైనా తక్కువ కాదు అనిపించుకుంటున్నారు. పేట్ బషీరాబాద్ సెయింట్ ఆన్స్ స్కూల్లో మంగళవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు దాదాపు 300 అంశాలపై నమూనాల ప్రదర్శన నిర్వహిచారు. నమూనాల గురించి వివరిస్తూ ఓరా అనిపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సత్తాచాటారు.
- కుత్బుల్లాపూర్,
ఎస్ఆర్ డిజి స్కూల్లో...
తార్నాకలోని ఎస్ఆర్ డిజి హైస్కూల్లో స్వచ్ఛ భారత్ థీమ్ పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఆలోచింపజేసింది. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇరిగేషన్, సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ నమూనా, సానిటేషన్‌లో అవలంభించాల్సిన నూతన పద్ధతులు, వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్, ఫింగర్ ప్రింట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తదితర విషయాలపై విద్యార్థులు నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. వృక్షాలను నరకొద్దని చెప్పే పప్పెట్ షో ఆకట్టుకుంది. లాలాగూడ పోలీసు స్టేషన్ ఇన్చార్జి సీఐ వంశీకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీర్వాణీ, ఎస్సై క్రాంతికుమార్, ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ రీసెర్చ్ స్కాలర్ దునుకు వేలాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- తార్నాక
ఆటోమేటిక్ రైల్వే గేట్
రామంతాపూర్ జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్యాంపస్‌లో విద్యార్థులు మంగళవారం ప్రదర్శించిన ఆటోమేటిక్ రైల్వేగేటు నమూనా విశేషంగా ఆకట్టుకుంది. లెక్చరర్ బి.రాజా మాట్లాడుతూ పరిశోధనలు నిరంతరం కొనసాగిస్తే వాటితో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన దుర్ఘటనతో చలించి విద్యార్థులు ఆటోమేటిక్ రైల్వేగేటు తయారు చేశారన్నారు. కేవలం రూ.5వేలతో మూడు నెలల్లో విద్యార్థులు జశ్వంత్శ్రీ, బీమ్రాజు, రమ్య, అరవింద్, శ్రవణ్‌కుమార్, శ్రీనాధ్, శిరీషా, రాజు తయారు చేశారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి.శ్యాంసుందర్‌రెడ్డి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ హెచ్ఓడీ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
-రామంతాపూర్