ద్వేషదావాగ్నిపై దయావర్షం క్రీస్తు
గాంధీనగర్ (కాకినాడ) :ద్వేషదావాగ్ని ప్రజ్వరిల్లే వేళ.. దయావర్షమై కురిసిన వాడు క్రీస్తు. అణువణువునా స్వార్థపు ముళ్లు మొలిచిన మానవాళి నడుమకు దివ్యసుమంలా దిగివచ్చి, ప్రేమ పరిమళాన్ని పంచిన వాడు క్రీస్తు! తనపై కత్తివేటు వేసిన వాడికి కష్టమొచ్చినా.. గుండె కరిగి నీరయ్యే ఆ కరుణామయుడు, ఆ దైవకుమారుడు కన్ను తెరిచిన పావనదినం క్రిస్మస్ను గురువారం జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. చర్చిలలో ఉదయం నుంచి జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు క్రైస్తవులు కుటుంబసమేతంగా హాజరయ్యారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తుని, పిఠాపురం, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. యువతీయువకులు ప్రత్యేక ప్రార్థనల్లో క్రిస్మస్ గీతాలను ఆలపించారు.
అమలాపురంలో కోనసీమ గోదావరి డెల్టామిషన్, రాజమండ్రిలో సెయింట్‌పాల్స్ లూథరన్ చర్చి, ఏసుప్రేమాలయం, ఆల్కట్‌తోటలోని హిల్ పాలియా, కాకినాడలో హౌస్ ఆఫ్ ప్రేయర్, ఏపీఎస్పీ బాప్టిస్ట్ చర్చి, క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి, క్రేగ్ ఇమానియల్ బాప్టిస్ట్ చర్చిలలో క్రిస్మస్ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులందజేశారు. చర్చిల ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెవరెండ్ ప్రతాప్‌సిన్హా, కార్యదర్శి డానియేల్‌పాల్, కోశాధికారి దొమ్మేటి శామ్యూల్సాగర్ల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ చైతన్యరాజు కాకినాడలోని పలు చర్చిలు సందర్శించి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో సీనియర్ పాస్టర్లు రెవరెండ్ జాన్బెంజ్, రెవరెండ్ ఏసురత్నం, జోసఫ్ బెన్ని, రెవరెండ్ విజయ్‌కుమార్, జాన్లాజర్స్ తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం మన్నాలో..
అమలాపురం : అమలాపురం మన్నా జూబ్లీ చర్చి అధ్వర్యంలో బుధవారం రాత్రి మిరియాం గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. మన్నా మినిస్ట్రీస్ అధినేత కార్ల్ డేవిడ్ కొమనాపల్లి (లాల్) క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. 2015 క్యాలెండర్‌ను పాస్టర్ జ్యోతిరాజు ఆవిష్కరించారు. ఒంటెలతో ఊరేగుతూ క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. బాణ సంచా కాల్చుతూ గ్రాండ్ పినాలే బెలూన్ పార్కును ఏర్పాటుచేశారు. ‘ఇజ్రాయిల్ నాతో’ నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. వేలాదిమంది పాల్గొన్న ఉత్సవాల్లో సరోన్ రోజ్ కొమానపల్లి, ఎర్నెస్ట్ తాతపూడి, తాతపూడి ఈస్టర్, ఎన్.ఎబర్ తదితరులు పాల్గొన్నారు.