కేథలిక్ చర్చిలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: నగరంలోని ఓ కేథలిక్ చర్చిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం గం 7.15 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తూర్పు ఢిల్లీలోని దిల్షాద్గార్డెన్ ప్రాంతంలోగల సెయింట్ సెబాయిస్టియన్ చర్చిలో ఉదయం ఉదయం గం 7.15 నిమిషాలకు పొగలు రావడాన్ని చౌకీదార్ గమనించాడు. దీంతో అతను ఈ విషయాన్ని అగ్నిమాపక శాఖతోపాటు చర్చి నిర్వాహకులకు చేరవేశాడు. ఈ సమాచారం అందగానే అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ నాలుగు వాహనాలతో అక్కడి కి చేరుకున్నారు.
మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వారికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. ఈ విషయమై చర్చి ఫాదర్ స్టాన్లీ మాట్లాడుతూ తొలుత ప్రార్థనా మందిరంలో మొదలైన మంటలు ఆ తరువాత రెండో అంతస్తుకు వ్యాపించాయన్నారు. ఈ చర్చిలో సర్వం దగ్ధమైందని, అసలేమీ మిగలలేదని అన్నారు. కాగా ఈ చర్చి హిందువులు, కైస్త్రవులు కలగలిసి జీవనం సాగించే ప్రాంతంలో ఉంది. ఈ చర్చి సంరక్షుడొకరు మాట్లాడుతూ 2001లో ఐదువేల మంది క్రైస్తవులు ఇక్కడ నివసించేవారన్నారు. ఇదే విషయమై డీసీపీ ఆర్.ఎ.సంజీవ్ మాట్లాడుతూ కిటికీ అద్దాలు పగిలిపోయి కనిపించాయన్నారు. అంతేకాకుండా త్వరగా కాలిపోయే స్వభావం కలిగిన వస్తువులు కూడా ఇక్కడ తమకు లభించాయన్నారు.
అంటే దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే విషయం స్పష్టమవుతోందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు. షార్ట్సర్క్యూట్కూ అవకాశం లేకపోలేదన్నారు. కాగా ఈ ఘటనకు నిరసనగా ఐటీఓ ప్రాంతంలోని పోలీస్స్టేషన్ ఎదుట కొన్ని క్రైస్తవ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. చర్చిని సందర్శించిన ఆప్ నేత అరవింద్: అగ్నిప్రమాదం చోటుచేసుకున్న తూర్పు ఢిల్లీలోని దిల్షాద్గార్డెన్ ప్రాంతంలోగల సెయింట్ సెబాయిస్టియన్ చర్చిని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు.