ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధి
ముసాయిదా చట్టానికి కేబినెట్ ఆమోదం
- జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల కేటాయింపు
- ఒక ఏడాది ఖర్చు కాకుంటే వచ్చే ఏడాదికి బదిలీ
- మూడు నెలలకోసారి అసెంబ్లీకి వ్యయ నివేదిక
- భూదాన్ చట్టానికి ఐదు సవరణలు
- నియమిత పదవులు, జీతాల చెల్లింపులకూ సవరణ
- ఈ సమావేశాల్లోనే బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్)లకు ప్రత్యామ్నాయంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేసే చట్టం ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతోపాటు భూదాన్ చట్ట సవరణ, జీతాల చెల్లింపు చట్ట సవరణ బిల్లులను ఆమోదించింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లులను అసెంబ్లీ, శాసన మండలిలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులతో పాటు సభలో ప్రవేశపెట్టాల్సిన మూడు బిల్లులపై ప్రధానంగా చర్చించారు.
బడ్జెట్ రూపకల్పనలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు బదులు కొత్త చట్టం అనివార్యమని ప్రభుత్వం భావించింది. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలి.. నిధులెలా ఖర్చు చేయాలన్న అంశాలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ అధ్వర్యంలో సీఎం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. సబ్‌కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు కొత్త చట్టం ముసాయిదాను తయారు చేశారు.
దీని ప్రకారం ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బడ్జెట్లో జనాభా నిష్పత్తి ప్రకారం విధిగా నిధులు కేటాయిస్తారు. ఈ నిధులు ఒక ఏడాది ఖర్చు కాకపోతే.. వాటిని తదుపరి సంవత్సరానికి బదిలీ చేసే పద్ధతిని (క్వారీ ఫార్వర్డ్) అనుసరిస్తారు. సబ్‌ప్లాన్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయటం లేదని, దారి మళ్లిస్తున్నారనే విమర్శలుండేవి. అందుకే కొత్త చట్టం ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి ఎస్టీ, ఎస్టీ అభివృద్ధి నిధికి సంబంధించిన ఖర్చుల నివేదికలను అసెంబ్లీ, మండలి ముందుంచుతారు. పథకాల వారీగా వ్యయాన్ని వెల్లడిస్తారు. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయిస్తే సరిపోదని, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఆ నిధులను పూర్తి స్థాయిలో ఉపయోగించే లక్ష్యంతోనే ప్రభుత్వం కొత్త చట్టానికి రూపకల్పన చేసింది.
భూదాన్ చట్ట సవరణకు ఓకే
ప్రస్తుతం అమల్లో ఉన్న భూదాన్ చట్టాన్ని సవరించేందుకు మంత్రివర్గం అమోదం తెలిపింది. కొత్తగా ప్రతిపాదించిన ఐదు సవరణల ప్రకారం.. భూదాన్ ట్రస్ట్‌లోని సభ్యత్వాన్ని సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం తొమ్మిది మందితో ఉన్న భూదాన్ బోర్డులోని సభ్యుల సంఖ్యను అనుకున్నప్పుడు.. అవసరం మేరకు ప్రభుత్వం తగ్గించే వెసులుబాటు ఉంటుంది. బోర్డు కాల పరిమితి ముగిసిన తర్వాత మూడేళ్ల వ్యవధిలో కొత్త బోర్డు నియామకం చేపట్టాలి. ఆక్రమణకు గురైన భూదాన్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం తహసీల్దార్లు/ఆర్డీవోల పరిధిలో ఉంటుంది. నిరుపయోగంగా ఉన్నవి, ఇప్పటికీ పంపిణీ కాని భూములన్నీ భూదాన్ బోర్డు అధీనంలోకి వస్తాయి. వీటిని తిరిగి పంపిణీ చేస్తారు.
జీతాల చెల్లింపుల సవరణ బిల్లు
నియామక పదవులు, జీతాల చెల్లింపులకు (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్) సంబంధించిన చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ప్రభుత్వ సలహాదారులు, నామినేటేడ్ హోదాల్లో ఉన్న వారికి చెల్లించే జీతాలతోపాటు రెండేసి పదవుల్లో ఉన్న వారికి చెల్లించే వేతనాలకు స్వల్పంగా మార్పులు చేసినట్లు తెలిసింది.