హెచ్‌సీఏపై మరో పిడుగు
- విశాకకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు
- స్టేడియం హక్కుల వివాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కొత్త కార్యవర్గానికి ఎన్నికైన రెండు వారాల్లోపే షాక్ తగిలింది. ఉప్పల్ మైదానంలో ‘ఇన్ స్టేడియా’ హక్కులకు సంబంధించి హెచ్‌సీఏ తరఫున అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తి కానంత వరకు విశాక ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా గతంలో వేర్వేరు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులే అమలవుతాయని స్పష్టం చేసింది. ఫలితంగా ప్రస్తుతం జరుగుతున్న సీఎల్ టి20 టోర్నీకి సంబంధించి విశాకకు హెచ్‌సీఏ నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే కోర్టు ఉల్లంఘన కింద హెచ్‌సీఏపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే బుధవారంనుంచి జరగాల్సిన మ్యాచ్‌లు సందేహంలో పడినట్లే!
హెచ్‌సీఏ, విశాక మధ్య జరిగిన 2004లో ఒప్పందం ప్రకారం స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా మైదానం లోపల ప్రకటనలు ప్రదర్శించుకునేందుకు విశాక ఇండస్ట్రీస్‌కు హక్కు ఉంది. అలా కాని సందర్భంలో దానికి తగిన మొత్తం వారికి హెచ్‌సీఏ చెల్లించాల్సి ఉంటుంది. 2011లో ఈ విధంగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినప్పుడు హెచ్‌సీఏ రూ. 75 లక్షలు చెల్లించింది. అయితే ఆ తర్వాత రెండేళ్లు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జి. వినోద్ ఉన్న సమయంలో ఇది జరగలేదు. ఆర్బిట్రేషన్ ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని నిర్ణయించినా అది వేగంగా సాగలేదు. ఈ మధ్య కాలంలో హెచ్‌సీఏ సిటీ సివిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినా తీర్పు వ్యతిరేకంగానే వచ్చింది. అయితే ఈ నెల 7న ఎన్నికల్లో ఓడిపోగానే వినోద్ మరో సారి హెచ్‌సీఏకు నోటీసు పంపించారు. ఈ దశలో చర్చలతో సమస్యను పరిష్కరించుకోకుండా అర్షద్ అయూబ్ మళ్లీ కోర్టుకెక్కారు.