దుర్గగుడి ఈవో వేధింపులపై ఆగ్రహం
అర్చకుల నిరసనలు ఆర్జిత సేవలు రద్దు
నేడు ఏపీలోని13 జిల్లాల నుంచి అర్చకుల రాక
విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఆలయ అర్చకులు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న విజయవాడ కనకదుర్గ గుడి ఈవో నర్సింగరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలో గురువారం నుంచి నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈవో నర్సింగరావు వేధింపుల కారణంగా ఆలయ అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావు ఆస్పత్రిపాలు కావడంతో ఆలయ అర్చకులు, సిబ్బంది నిరసనకు దిగారు. అర్చకులు, వేద పండితులు, వివిధ శాఖలకు చెందిన ఆలయ అధికారులు, సూపరిండెంటెంట్లు, ఏఈవోలు, రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు మొదలైన దీక్ష రాత్రి వరకు కొనసాగింది. అమ్మవారికి నిత్యం జరిగే శ్రీచక్ర నవార్చన, చండీయాగం, కుంకుమార్చన, శాంతి కల్యాణాలను నిలిపేశారు. దీక్ష చేపట్టిన అర్చకుల్లో రాజకొండ గోపీకి ఎండ తీవ్రత కారణంగా ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దీక్షలకు మద్దతుగా 13 జిల్లాలకు చెందిన పలు అర్చక సంఘాలు, సమాఖ్యల వారు శుక్రవారం వస్తున్నట్లు దుర్గగుడి అర్చకులు తెలిపారు. అధికారుల వేధింపుల కారణంగానే అర్చకుడు మంగళపల్లి సుబ్బారావు (37) అనారోగ్యం పాలయ్యారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విధులు సరిగా నిర్వర్తించనందునే జరిమానా వేశానని, సుబ్బారావును ఎవరూ వేధించలేదని ఈవో చెప్పారు.
అరసవల్లిలో అర్చకుల ఆందోళన
శ్రీకాకుళం సిటీ: విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవో నర్సింగరావును సస్పెండ్ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంఘం ప్రతినిధులు కొత్తలంక మురళీకృష్ణ, శ్రీనివాసదీక్షితులు డిమాండ్ చేశారు. వారు గురువారం శ్రీకాకుళ ం జిల్లా అరసవల్లిలో ఆందోళన చేపట్టారు. కాగా ఈవో సీహెచ్ నర్సింగరావు సెలవుపై వెళ్లారు. తన కుమారుడు వివాహం ఉన్నందున ఈ నెల 30వరకు తాను సెలవు పెట్టినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తాత్కాలిక ఈవోగా కాకినాడ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించారు.