ఎస్-పీ ప్రెసిడెంట్‌గా భారతీయుడు
న్యూయార్క్: అతి పెద్ద రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) రేటింగ్ సర్వీసెస్‌కి ప్రవాస భారతీయుడు నీరజ్ సహాయ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఎస్అండ్పీ మాతృ సంస్థ మెక్‌గ్రా హిల్ ఫైనాన్షియల్ ఈ విషయాలు వెల్లడించింది. సహాయ్ (56) ప్రస్తుతం సిటీగ్రూప్‌లో సెక్యూరిటీస్ అండ్ ఫండ్ సర్వీసెస్ వ్యాపార విభాగానికి హెడ్‌గా పని చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఆయన ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేశారు.
కెరియర్ ప్రారంభంలో సిటీ గ్రూప్ భారత కార్యకలాపాల్లోనూ సహాయ్ కీలక పాత్ర పోషించారు. అమెరికాలో సిటీ గ్రూప్‌లో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. సిటీగ్రూప్‌లో 2002 నుంచి 2005 దాకా గ్లోబల్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ విభాగానికి సహాయ్ సీఎఫ్‌వోగా పనిచేశా రు. ఎస్అండ్పీ ప్రస్తుత ప్రెసిడెంట్ డగ్లస్ పీటర్సన్.. మాతృ సంస్థ సీఈవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో సహాయ్ నియమితులయ్యారు. ఎస్అండ్పీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సహాయ్ చెప్పారు. మెక్‌గ్రా హిల్ ఫైనాన్షియల్‌లో భాగమైన ఎస్అండ్పీ.. ప్రభుత్వ, కార్పొరేట్ల డెట్‌కి సంబంధించి 10 లక్షల పైగా క్రెడిట్ రేటింగ్స్‌ను ఇస్తోంది.