శతాబ్దాల క్రితమే కార్మిక సంక్షేమం!
చరిత్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం రకరకాల పథకాలు ప్రకటిస్తుంటాయి. అలాంటి జాతీయ ఆరోగ్య సేవలను 20 వ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణలుగా కూడా చెబుతుంటారు. అయితే 3,600 ఏళ్ల క్రితమే... ఇప్పటి ‘సంక్షేమ విధానాలు’, ‘హెల్త్ కేర్’ సిస్టమ్ ఈజిప్ట్‌లో అమల్లో ఉండేవని తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఒక శిలపై కనిపించిన రాతలలో వెల్లడయ్యాయి. స్టాన్ఫోర్డ్ అర్కియాలజిస్ట్ యాన్ ఆస్టిన్ నేతృత్వంలో కార్మికులు నివాసముండే ప్రాచీనమైన ఈజిప్షియన్ గ్రామం ఎల్- మెదీనాలో ఇటీవల తవ్వకాలు జరిగాయి. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాజులు ఈ గ్రామాన్ని నిర్మించినట్లు ఆ పరిశోధనల్లో బయటపడింది.
జీతభత్యాలే కాకుండా కార్మికుల నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్రోత్సాహలను నాటి ప్రభుత్వాలు ప్రకటించేవి. కార్మికులకు గృహవసతి ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, వాళ్ల ఇళ్లలో పని వాళ్లను కూడా ఏర్పాటు చేసేవి! ఇప్పటిలాగే అప్పుడూ కార్మికులకు సిక్ లీవ్‌లు కూడా ఉండేవి. కార్మికుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా వైద్యుడు ఉండేవాడు. కార్మికుల క్షేమం గురించిన ఇలాంటి విషయాలు మాత్రమే కాక... ఆనాటి వైద్య విధానాలు ఎలా ఉండేవనేది కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది.