గోంగూర పచ్చడి కంపల్సరీ
సిటీప్లస్
‘హైదరాబాద్‌లోనే పుట్టాను. ఇక్కడి విద్యారణ్య, స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో చదువుకున్నాను. ఈ నగరం నాకు చాలా నేర్పింది. చిన్నతనంలోనే పెద్ద ఆలోచనలు చేసేలా నన్ను మార్చింది’ అంటూ సిటీతో తన జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు మాజీ బ్యూటీక్వీన్, బాలీవుడ్ నటి దియామీర్జా. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాబాలన్ హీరోయిన్గా తాను ప్రొడ్యూస్ చేసిన బాబీజాసూస్ సినిమా కోసం చాలా రోజులు ఇక్కడ గడిపానని, మళ్లీ ఇప్పుడే అఫిషియల్‌గా రావడమని చెప్పారు. ‘ఇక్కడకు వ చ్చి.. తిరిగి వెళ్లేటప్పుడు గోంగూర పచ్చడి కంపల్సరీగా ఉండాల్సిందే. అన్నీ కుదిరితే త్వరలోనే తెలుగు సినిమా నిర్మిస్తా’ అని చెప్పారు దియా.
మహిళల స్వయం సాధికారత అంటే తనకు చాలా గౌరవమంటున్న దియా.. ఆడ- మగ ఇద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకోవాలన్నారు. తల్లి, చెల్లి, భార్య, స్నేహితురాలు.. ఇలా ఏ పాత్రలోనైనా మహిళ ఎంతో మనస్ఫూర్తిగా ఇమిడిపోతుందన్నారు. వరల్డ్‌కప్‌లో విరాట్‌కొహ్లీ ఫెయిల్యూర్‌కి, తద్వారా ఇండియా సెమీస్‌లో పరాజయం పాలవడానికి అతని గాళ్‌ఫ్రెండ్ అనుష్క కారణమంటూ అందరూ తప్పుపడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదెంత మాత్రం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా ఫిక్కీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. దాదాపు 200 మంది మహిళలు హాజరైన ఈ కార్యక్రమాన్ని ఫిక్కీ చైర్పర్సన్ మోనికా అగర్వాల్ పర్యవేక్షించారు.