సింధు, కోహ్లిలకు ‘అర్జున’అవార్డులు, రంజన్ సోధి కి ‘ఖేల్ రత్న’!
న్యూఢిల్లీ: వరుస ప్రపంచకప్‌ల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయ ట్రాప్ షూటర్ రంజన్ సోధి పేరును... ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర’కు సిఫారసు చేశారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిలను ‘అర్జున’ అవార్డులు వరించనున్నాయి. బిలియర్డ్స్ దిగ్గజం మైకేల్ పెరీరా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది క్రీడాకారులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. 2010 కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత రంజిత్ మహేశ్వరి (ట్రిపుల్ జంప్), రైజింగ్ గోల్ఫ్ స్టార్ గగన్జిత్ బుల్లర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఖేల్త్న్ర అవార్డుకు క్రీడా శాఖ నుంచి ఆమోదం లభిస్తే... ఈ పురస్కారం దక్కించుకున్న ఏడో షూటర్‌గా సోధి రికార్డులకెక్కుతాడు.
ఆశ్చర్యకర విషయమేమిటంటే గత మూడేళ్లలో ఈ అవార్డు షూటర్లకే దక్కడం విశేషం. 2011లో గగన్ నారంగ్, 2012లో రెజ్లర్ యోగేశ్వర్ దత్తో కలిసి లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత విజయ్ కుమార్‌కు ఈ పురస్కారం లభించింది. పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్ జన్మించిన రంజన్ సోధి... 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు. అయితే లండన్ ఒలింపిక్స్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. గతేడాది జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. 33 ఏళ్ల సోధి 2009లో అర్జున అవార్డును దక్కించుకున్నాడు.
అర్జున అవార్డీలు: కోహ్లి (క్రికెట్), చక్రవోల్ సువురో (ఆర్చరీ), రంజిత్ మహేశ్వరి (అథ్లెటిక్స్), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), కవితా చాహల్ (బాక్సింగ్), రూపేశ్ షా (స్నూకర్), గగన్జిత్ బుల్లర్ (గోల్ఫ్), సాబా అంజుమ్ (హాకీ), రాజ్‌కుమారీ రాథోర్ (షూటింగ్), జోత్స్న చినప్ప (స్క్వాష్), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్), నేహా రాతీ (రెజ్లింగ్), ధర్మేంద్ర దలాల్ (రెజ్లింగ్), అభిజిత్ గుప్తా (చెస్), అమిత్ కుమార్ సరోహా (ప్యారా స్పోర్ట్స్). (కమిటీ ఎంపిక చేసిన వారికి అవార్డులు ప్రకటించడం లాంఛనమే. క్రీడాశాఖ ఆమోదం తర్వాత ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు)