వయ్యారి భామ.. వదలదే రామ
కామవరపుకోట: వయ్యారి భామ.. రోడ్ల పక్కన, కాలువ గట్లు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో పెరిగే ఈ కలుపు మొక్క అన్ని ప్రాంతాల్లో త్వరితగతిన వ్యాపిస్తూ పంట దిగుబడిని తగ్గిస్తుంది. అంతేకాక జంతువులతో పాటు మానవులకూ హాని చేస్తుంది. పార్దేనియమ్ హిస్టిరోఫోరస్ ఆస్టరేసి జాతికి చెందిన వయ్యారిభామ మొక్క విషయంలో రైతులు, పశుపోషకులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కామవరపుకోట వ్యవసాయాధికారి డి.ముత్యాలరావు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఇతర పేర్లు: వయ్యారి భామను కాంగ్రెస్ గడ్డి, స్టార్వీడ్, కారెట్ వీడ్, వైట్ క్యాప్, చాటక్ చాంద్ని, బ్రూమ్ బుష్, ఒసడి, గజరి, ఫండ్రపులి, సఫేద్టోపి అనే పేర్లతో కూడా పిలుస్తారు.1950 దశకంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల ద్వారా ఇది మన దేశంలోకి ప్రవేశించిందని సమాచారం. పూణే, ఢిల్లీ ప్రాంతాల్లో 1956లో మొదటిసారిగా ఈ మొక్కను కనుగొన్నారు. తరువాత ఇది దేశమంతా వ్యాపించింది. ఈ మొక్క సుమారు 90 నుంచి 150 సెం.మీ ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు చీలి క్యారట్ ఆకులను పోలి ఉంటాయి.
అందుకే దీనిని ‘కారట్’ అని కూడా అంటారు. దీని పుష్పాలు తెల్లగా ఉంటాయి. ఒక్కో మొక్క దాదాపుగా పది వేల నుంచి పదిహేను వేల వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. విత్తనాలు అతి చిన్నవిగా ఉండి త్వరితగతిన అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి. అధిక విత్తనోత్పత్తి, సమర్థవంతమైన విత్తనవ్యాప్తి, ఇతర మొక్కలపై రసాయనాల ప్రభావం వంటి కారణాల వల్ల ఈ మొక్క ఇంతగా వ్యాప్తి చెందుతోంది. ఈ మొక్క వల్ల పంటల దిగుబడి 40 శాతం, పశుగ్రాస పంటల దిగుబడి 90 శాతం తగ్గుతుందని వ్యవసాయాధికారి తెలిపారు.