7 నుంచి పీజీ మెడికల్ ప్రవేశ దరఖాస్తులు
విజయవాడ : 2015-16 విద్యా సంవత్సరంలో పీజీ మెడికల్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 7 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రిజిస్ట్రార్ చెప్పారు. మెడికల్ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా), పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు కలిపి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలకు 7 నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వర్సిటీ రిజిస్ట్రార్ చెప్పారు. దరఖాస్తు చేసుకునే విధానం, ప్రవేశ పరీక్ష ఫీజు వివరాలతో హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈసారి డెబిట్/క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రవేశ పరీక్ష ఫీజును చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లించిన వారికి సెల్ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా గుర్తింపు నంబరు వస్తుంది. దీనిద్వారా ఆన్లైన్లో దరఖాస్తు పూర్తిచేసిన ప్రింటును, సంబంధిత సర్టిఫికెట్లను గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి 'ది కన్వీనర్, పోస్టుగ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కమిటీ, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్, ఏపీ విజయవాడ' చిరునామాకు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పోస్టు ద్వారా లేదా స్వయంగా అందజేయాలి. వివరాలను http://ntruhs.ap.nic.in వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు.