జూరాల ప్రాజెక్టు 4 క్రస్టుట్ల ఎత్తివేత
జూరాల : రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు వరద ప్రవాహం పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి 65వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండటంతో జెన్కో అధికారులు ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం పై నుంచి వస్తున్న వరదతో పూర్తిస్థాయికి చేరింది. దీంతో ఎత్తిపోతల పథకాలు, ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి ద్వారా 48వేల క్యూసెక్కులు, నాలుగు క్రస్టుగేట్ల ద్వారా 21,780క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని శ్రీశైలం రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు.
జూరాల రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 450క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 850క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. భీమా ప్రాజెక్టు లిఫ్ట్–1కు 1,300 క్యూసెక్కులు, లిఫ్ట్–2కు 750క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం (కేఎస్పీ) కి 630క్యూసెక్కులు ఇలా మొత్తం 73,760క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురియకపోవడంతో కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేదు.
అక్కడి విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 10,320క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా ప్రస్తుతం 125.11టీఎంసీలు ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.64టీఎంసీల నీటినిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వల ద్వారా 4,448క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.