కుక్కను ఆకలితో మాడ్చినందుకు మహిళ అరెస్టు
మనుషులకే అన్నం లేక మలమల మాడిపోతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ అమెరికాలో మాత్రం ఓ కుక్కకు అన్నం పెట్టనందుకు గాను జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించారంటూ ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కార్లా బష్నెల్ అనే మహిళను ఎన్ఫీల్డ్ ప్రాంత పోలీసులు అరెస్టు చేశారు. మరణించిన స్నేహితురాలి కుటుంబ సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు.
స్నేహితురాలు మరణించినప్పుడు.. కార్లాయే ఆమె పెంపుడు కుక్క ఆలనాపాలనా చూస్తానని చెప్పిందని, కానీ ఇప్పుడు మాత్రం దానికి తిండికూడా పెట్టకుండా మాడ్చిందని వారు ఆరోపించారు. దాంతో ఆ కుక్క మరణించగా, ఆ విషయాన్ని పోస్టుమ్యాన్ చూసి చెప్పాడట. అది కేవలం కుక్క కాదని, తమ సొంత బిడ్డలాంటిదని వాళ్లు వాపోయారు. అయితే ఈ విషయమై వ్యాఖ్యానించేందుకు కార్లా నిరాకరించారు. బెయిల్ కోసం మాత్రం ఆమె దరఖాస్తు చేసినట్లు న్యూయార్క్ డైలీ తన కథనంలో తెలిపింది.