ఢిల్లీలోనూ ‘ఢీ’సీసీయే..!
* తెగని జిల్లా కాంగ్రెస్ పంచాయితీ
* దిగ్విజయ్ సమక్షంలో మాటలయుద్ధం
* అధ్యక్షుడి ఎన్నిక మళ్లీ వాయిదా
* రేసులో రాంరెడ్డి, ఐతం సత్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఢిల్లీ పెద్దల సాక్షిగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రతిష్ట మరోసారి మసకబారింది. డీసీసీ అధ్యక్షుని వ్యవహారం తేల్చడానికి జిల్లా కాంగ్రె స్ నేతలను ఆ పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వారితో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను చూసి దిగ్విజయ్ నివ్వెర పోవాల్సి వచ్చిందట. జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగిన మాటల యుద్ధంతో అధ్యక్షుని ఎన్నిక మరోసారి వాయిదా పడింది.
దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ‘నోటితో పలుకరించుకుని నొసటితో వెక్కిరించుకున్నట్లు’గా వ్యవహరించారట.
అందుకే ఢిల్లీ పెద్దలు వీరిమధ్య సయోధ్య కుదర్చటం తమవల్ల కాదని అసహనం వ్యక్తం చేస్తూ.. హెచ్చరించినట్లు సమాచారం. ఎంపీ రేణుకాచౌదరి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి జట్టి కుసుమకుమార్, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డి.శ్రీనివాస్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్ష ఎన్నిక వ్యవహారం వచ్చే సరికి జిల్లా నేతల్లో కొందరు పరస్పర ఆరోపణలు, పత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలు, దూషణల పర్వానికి దిగేసరికి సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారని సమాచారం.
పెద్దలు నచ్చజెప్పినా పెడచెవినే..!
జిల్లా కాంగ్రెస్‌ను మరింత పరిష్ట పరిచేందుకు నేతలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ సమావేశం ఆరంభంలోనే ఉద్బోధించారట. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉందని, ప్రతికూల పరిస్థితుల్లోనూ నాలుగు స్థానాల్లో విజయం సాధించటం సామాన్య విషయం కాదని దిగ్విజయ్ మాట్లాడారని తెలిసింది. జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని దిగ్విజయ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, జిల్లా నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వ్యవహారం కొలిక్కిరాలేదని సమాచారం. ఎవరికి వారు తమదే పైచేయి కావాలనే రీతిలో జిల్లా పార్టీని ప్రత్యర్థివర్గం ఏరకంగా ఇబ్బంది పెట్టింది, దాని వల్ల వచ్చిన ప్రతికూల ఫలితాలేమిటో సమావేశంలో ఏకరువు పెట్టినట్లు తెలిసింది.
రగడ ఇలా మొదలైంది..
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి పేరును ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ప్రతిపాదించడంతో రగడ మొదలైందట. రేణుక- సుధాకర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగిందని సమాచారం. రాంరెడ్డి వెంకటరెడ్డి పేరును రేణుకాచౌదరి బహిరంగంగానే వ్యతిరేకించగా జిల్లాకు చెందిన ఇతర నేతలు వారి వాదప్రతివాదాల్లో తలదూర్చకుండా తటస్థంగానే వ్యవహరించారని తెలిసింది. వెంకటరెడ్డి పేరుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో తాను ఈ వయసులో జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడలేనని, అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే అధ్యక్షుడిగా ఉంటానని ఆయన సమావేశంలో అన్నట్లు సమాచారం.
సమావేశంలో ఏకగ్రీవ ప్రతిపాదన వచ్చేలా లేదని, జిల్లా నేతలు పార్టీ పతిష్టను దృష్టిలో ఉంచుకొని కొంత సమయమనంతో వ్యవహరించాలని దిగ్విజయ్ కోరినా ఆశించిన ఫలితం రాలేదట. ఈ సమావేశంలో ఒక వర్గం మరో వర్గానికి చెక్ పెట్టగలిగామన్న సంతృప్తి మినహా అధ్యక్ష ఎన్నిక విషయాన్ని ఓ కొలిక్కి తేలేకపోవడంపై ఆ పార్టీ కేడర్ నుంచి విమర్శలు వస్తున్నాయి.
రేణుకాచౌదరి వర్గం జిల్లా అధ్యక్ష స్థానం కోసం పలు పేర్లను సూచిస్తుందని రాంరెడ్డి వర్గీయులు భావించారు. కానీ ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎటువంటి ప్రతిపాదనలు చేయకుండా సుధాకర్‌రెడ్డి సూచించిన వెంకటరెడ్డి పేరును తిప్పికొట్టేందుకే ప్రాధాన్యం ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.
మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఐతం సత్యాన్ని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలనే విషయమై ఈ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగిందని తెలిసింది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సైతం జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, సామాజిక సమీకరణల దృష్ట్యా సత్యంను నియమించడమే సబబని వాదన వినిపించినట్లు తెలిసింది. అయితే సత్యం విషయంలోనూ ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎవరి పేరు సూచిస్తారో సాయంత్రంలోగా తెలపాలని, వారిలో ఒకరిని అన్ని కోణాల్లో పరిశీలించి ఎంపిక చేస్తామని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
చివరికి ఇలా...
రేణుక, వెంకటరెడ్డి వర్గీయులతో పాటు మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్ ఢిల్లీలో విడివిడిగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన జాబితాను దిగ్విజయ్ ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఈ మేరకు రాంరెడ్డి పేరును పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రతిపాదించగా, ఐతం సత్యం పేరును రేణుక, వెంకటరెడ్డి, సుధాకర్‌రెడ్డి మినహా ఇతర నేతలు, కొందరు ప్రజాప్రతినిధులు సూచించారు. పూర్తిస్థాయి అధ్యక్షున్ని నియమించే వరకు సత్యాన్ని జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడిగా కొనసాగించాలన్న ప్రతిపాదననూ సైతం సదరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొందరికి నోటీసులు జారీ చేయడంపైనా వాడీవేడిగా చర్చ సాగినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని ఒక వర్గం, పార్టీ అధినేతలపై నోరు పారేసుకోవడం వల్లే నోటీసులు వచ్చాయని మరో వర్గం వాదప్రతివాదనలకు దిగినట్లు సమాచారం.