శనగ కొనుగోళ్ల ఊసేదీ?
పర్చూరు, న్యూస్‌లైన్: శనగ రైతుల విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజాప్రతినిధులు వారి గోడు వినేందుకు మాత్రమే పనికొస్తున్నారు తప్ప వారిని ఒడ్డున వేసే ప్రయత్నాలు చేయడం లేదు. జిల్లాలోని శీతల గిడ్డంగుల్లో, ప్రైవేటు గోదాముల్లో ప్రస్తుతం 15 లక్షల క్వింటాళ్ల శనగలున్నాయి. పరిస్థితి తీవ్రతను పలుమార్లు రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం శనగ నిల్వల్లో పది శాతం నిల్వలు రైతులకు గిట్టుబాటయ్యే ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేసి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్),ఊసేదీ?
కేంద్ర వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్)ల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు రూ 75 కోట్లు అవసరమవుతాయని తేల్చారు. ఈ మొత్తం నిధుల్లో 2013 డిసెంబర్ 18న రూ 10 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొనుగోళ్లకు ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ క్వింటా రూ 4,500 కొనుగోలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.
మార్కెట్ జోక్యం పథకం కింద రైతుల వద్ద ఉన్న నిల్వలన్నీ కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే ప్రభుత్వం మాత్రం పది శాతం నిల్వల కొనుగోలుకే ముందుకొచ్చింది. దానికీ నేటికీ అతీగతీ లేదు. రైతుల ఒత్తిడి మేరకు మొక్కుబడిగా రూ 10 కోట్లు విదిల్చిన ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వరకు తాత్సారం చేసి నోటిఫికేషన్ వచ్చిన తరువాత తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ నెల రోజుల్లో శనగ పంట చేతికొస్తుంటే ప్రస్తుతం ఉన్న నిల్వల కొనుగోలులో జాప్యం జరగడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
శనగ రైతులను ఆదుకోవాలని ఇప్పటికే రైతు సంఘాలు, రైతులు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. క్వింటా శనగల ఉత్పత్తికి రూ 4 వేలు అవుతుంటే ప్రభుత్వం మద్దతు ధర రూ 3 వేలు ప్రకటించడం దారుణమని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం క్వింటా శనగల ధర రూ 7,500 ఉందని, పెట్టుబడులు పెరుగుతుంటే ధరలు పతనమవుతున్నాయని, ఇదెక్కడి చోద్యమని రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ 100 కోట్లు కేటాయించి శనగలు క్వింటా రూ 4,500 చొప్పున కొనుగోలు చేస్తే కొంత మేర ఊరట కలుగుతుందని చెబుతున్నారు.