రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టుకు జిల్లాలోనే శిక్షణ!
శ్రీకాకుళం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: జాతీయ పాఠశాలల క్రీడల (స్కూల్ గేమ్స్) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టుకు శ్రీకాకుళంలోనే శిక్షణ శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రతినిధులు, అధికారులు భావిస్తున్నారు. జనవరి రెండో వారంలో జరగనున్న ఈ పోటీలకు సంబంధించిన తేదీలు త్వరలో వెల్లడికావాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులందరినీ జాతీయ పోటీలకు పంపించాలని రాష్ట్ర స్కూల్ గేమ్స్ ప్రతినిధులు సమాలోచనలు చేస్తున్నారు. అదే జరిగితే అండర్-14 బాలబాలికల విభాగం నుంచి 40 మంది, అండర్-17 బాలబాలికల విభాగం నుంచి 68 మంది బాలబాలికలు ఎంపికవుతారు. మొత్తంమీద 108 మంది జాతీయ పోటీలకు అర్హత సాధిస్తారు. ఇదే లెక్కన తుది జట్టు ఎంపికలు జరిగితే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే అవకాశం ఉంది. వీరిలో అండర్-17 బాలురులో జావెలిన్‌త్రో క్రీడలో కె.జగన్నాథం ప్రథమ స్థానంలో నిలవగా... అండర్-14 బాలికల్లో లాంగ్‌జంప్‌లో జి.రమ్య ద్వితీయ స్థానంలో నిలిచింది. మరో ముగ్గురు టాప్-5 స్థానంలో నిలిచారు.
ఆతిథ్యం అదిరినా..!
ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన రాష్ర్టస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు జిల్లా క్రీడా యంత్రాంగం పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించింది. అయితే, క్రీడలకు ఆతిథ్యమిచ్చిన శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు మాత్రం ఘోరమైన వైఫల్యాన్ని చవిచూశారు. అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు. రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు కనీవినీ ఎరుగుని స్థాయిలో పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్‌తో పాటు అండర్-14 బాలబాలికల చాంపియన్ ట్రోపీలను సైతం కైవసం చేసుకోగా, ఆతిధ్య శ్రీకాకుళం మాత్రం కేవలం రెండంటే రెండు పతకాలు మాత్రమే సాధించి చివరి వరుసలో నిలిచింది.
లోపం ఎక్కడ ?
రాష్ట్రపోటీల్లో జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు మరీ ఇంత నీరసంగా ఆడడంపై జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్యతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులను సైతం కలవరపరుస్తోంది. లోపం ఎక్కడ జరిగిందనే విషయమై చర్చిస్తున్నారు. చేతలు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... ఎంపికల సమయంలో క్రీడాకారుల ప్రతిభ, అనంతరం వారికి శిక్షణ శిబిరాల ఏర్పాటు, నాణ్యమైన పీఈటీల సమక్షంలో తర్ఫీదునీయటం మరిచిన జిల్లా క్రీడల యంత్రాంగం పోటీలన్నీ ముగిసిన తర్వాత కారణాలు వెతుకుతోంది.
లాబీయింగ్ లేకపోలేదు..!
గత కొంతకాలంగా జిల్లాస్థాయి ఎంపికల సమయంలో కొంతమంది పీఈటీలు లాబీయింగ్ చేయించుకుని ప్రతిభ లేకపోయినా ఒత్తిడి చేసి జట్లకు ఎంపిక చేయించుకుంటున్నారనే అభియోగాలు ఉన్నాయి. దీనికి తోడు అథ్లెటిక్స్ విభాగంలో తర్ఫీదునిచ్చే డీఎస్ఏ అథ్లెటిక్స్ లేకపోవడం, శిక్షణ శిబిరాలు, ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలే వైఫల్యానికి కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు పైకా పథకం ఉద్దేశం పక్కదారి పట్టడంతో క్రీడాకారులకు మరిన్ని కష్టాలు, చిక్కులు వచ్చిపడుతున్నాయి. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ఎలాంటి లాబీయింగ్‌లకు ఆస్కారం లేకుండా అన్నివిధాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే పతకాలు పండించడం ఖాయమని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులే చెబుతుండడం గహనార్హం.